హనుమకొండ, ఆగస్టు 8 : తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో వరంగల్ నుంచే బీసీ రిజర్వేషన్ పోరాటం ప్రారంభిస్తామని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో రెండు రోజుల డ్రామా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీసీలను మోసం చేసిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్ర బీసీ ముఖ్య మంత్రి సిద్దరామయ్యను తీసుకొచ్చి ఎన్నికల ముందు బీసీ అంశంపై వాగ్దానం చేసినప్పటికీ నాటి హామీలు నేటి కాంగ్రెస్ మోసాలుగా మారాయని ధ్వజమెత్తారు. మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్లాంటిదని బీసీలకు ప్రతీ బడ్జెట్‌తో రూ.20వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పోయిన రెండు బడ్జెట్లలో కేవలం రూ.7వేలు, 10వేల కోట్లే కేటాయించిందన్నారు. రూ.లక్ష కోట్లు బీసీలకు కేటాయిస్తామని కాంగ్రెస్ మరో మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో బీసీలకు అన్ని రంగాల్లో 42శాతం అవకాశాలు కల్పిస్తామన్న కాంగ్రెస్ వేల కోట్ల కాంట్రాక్టులు మంత్రి శ్రీనివాస్‌రెడ్డి, మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు కానీ ఒక్క బీసీ కాంట్రాక్టర్‌కూ ఇవ్వలేదన్నారు. త్వరలో వరంగల్ కాకతీయ యూనివర్సిటీ వేదికగా బీసీ హకుల కోసం పోరాటాలకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. ఈ నెల 14న కరీంనగర్ వేదికగా బీసీల కోసం బీఆర్ఎస్ హయాంలో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు దాస్యం తెలిపారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని శాసనమండలి ప్రతిపక్షనేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. ఈ నెల 5, 6 తేదీల్లో బీసీ అంశంపై రేవంత్‌రెడ్డి ఢిల్లీలో భూకంపం సృష్టిస్తామని చెప్పి తన అసమర్థతతో బీఆర్ఎస్, బీజేపీని తిట్టి తన డొల్లతనాన్ని నిరూపించుకున్నాడని పేర్కొన్నారు. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని.. ఢిల్లీలో జరిగిన బీసీ రిజర్వేషన్ ధర్నాలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం పాల్గొనకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నైజం బయటపడిందన్నారు.
రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకలేదని సీఎం దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని.. ఆయనకు సొంత పార్టీ నాయకులే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయితే బీసీ రిజర్వేషన్ అమలు చేస్తారని చెబుతున్నారని మరి ఆయన ప్రధాని అయ్యేదెప్పుడు? బీసీ రిజర్వేషన్ అయ్యేదెప్పుడు అని సిరికొండ ప్రశ్నించారు. ఢిల్లీలో రిజర్వేషన్ అంశాన్ని పక్కనపెట్టి కేసీఆర్ గురించి మాట్లాడారని.. సీఎం రేవంత్‌రెడ్డికి మాట మార్చడం.. మడమ తిప్పడం అలవాటేనన్నారు. కాంగ్రెస్ 20నెలల పాలన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉన్నదని ఎద్దేవా చేశారు.
తమిళనాడులో రిజర్వేషన్ విషయంలో జయలలిత అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి రిజర్వేషన్ సాధించారని, కానీ తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్ది కేంద్రాన్ని ఒప్పించడం, అన్ని పార్టీలను మెప్పించడం చేయకుండా రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఇతర పార్టీలపై బదనాం వేస్తున్నాడని ఆరోపించారు. 9వ షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగ సవరణ జరిగితేనే 42శాతం రిజర్వేషన్ సాధ్యమవుతుందన్నారు. దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు కులగణన చేయలేదని ఆయన ప్రశ్నించారు.
బీసీ డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి బీసీలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. 42శాతం రిజర్వేషన్‌పై నిలదీస్తాం.. బీసీలకు ఇచ్చిన హామీలు తప్పకుండా అమలు చేయాల్సిందేనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బీసీల ద్రోహి పార్టీగా గుర్తించాలని మధుసూదనాచారి బీసీలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కార్పొరేటర్ సోదా కిరణ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, మాజీ చైర్మన్ చింతం సదానందం, నయీముద్దీన్, శోభన్, జానకీరాములు పాల్గొన్నారు.