హనుమకొండ, సెప్టెంబర్ 17: కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని.. ప్రజావ్య తిరేక, నియంత, నియంతృత్వ పాలన అని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని బుధవారం నిర్వహించగా, ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినయ్ భాసర్మాట్లాడుతూ తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కలను సాకారం చేసేందుకు కేసీఆర్14 ఏండ్ల పోరాటం చేశారని, ప్రాణాలకు తెగించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారన్నారు.
ప్రజలకు ఇచ్చిన, ఇవ్వని హామీలను నెరవేర్చడంతో పాటు వినూత్న సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత ఆయనకే దకుతుందని అన్నారు. కొందరు సెప్టెంబర్ 17ను విలీనం అని, విమోచనం అని ఎవరికి తోచిన విధంగా వారు కార్యక్రమాలు చేస్తున్నారని, కేసీఆర్ మాత్రం జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని అన్నారని అన్నారు. అందులో భాగాంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో వేడుకలు జరుపుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీలను మరిచి, ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు.
ఆ పార్టీ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేరన్నారు. యూరియా బస్తాల కోసం చంటి పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఏదని, రైతు, ఆటో కార్మికుల ఆత్మహత్యలు, రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం, నిరుద్యోగులు కష్టపడి పరీక్షలు రాస్తే ఉద్యోగాలు అమ్ముకోవడం ప్రజాపాలన అవుతుందా.. అని ప్రశ్నించారు. బీసీలకు చట్టసభల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ కమిషన్, కమిటీల పేరుతోజాప్యం చేస్తూ మోసం చేస్తున్నదని ఆరోపించారు.
ప్రశ్నించే వారిని లాఠీలతో కొట్టించడం, అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్నదని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తే కాంగ్రెస్ పాలనలో హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులు అనారోగ్యం, ఆసుపత్రుల పాలవుతన్నారన్నారు. మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని, కేబినెట్లో ఒక్కరికీ చోటు దక్కలేదని, ఇచ్చిన ఒక్క ఎమ్మెల్సీ కూడా నిలవదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారని అన్నారు.
కేంద్రంలోని బడేబాయి మోడీ, రాష్ట్రంలోని చోటే బాయి రేవంత్‌రెడ్డిలు కలిసి బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, ఆశ చూపి బీఆర్ఎస్ నాయకులను లాక్కున్నా తెలంగాణ, కేసీఆర్ ఉన్నంత వరకు ఎవ్వరూ ఏమి చేయలేరని, బీఆర్ఎస్, కేసీఆర్ ప్రజల పక్షాన పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లను ఆపివేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, మైనార్టీ నాయకుడు నయీముద్దీన్, బీఆర్ఎస్ నాయకులు రవీందర్రావు, జానకి రాములు, దూలం వెంకన్న, పసుపులేటి విష్ణువర్ధన్‌రెడ్డి, బండి రజినీకుమార్, నరెండ్ల శ్రీధర్, మూటిక రాజు, చాగంటి రమేశ్, విజయ్‌రెడ్డి, బైరపాక ప్రశాంత్, గండ్రకోట రాకేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.