హనుమకొండ, ఆగస్టు 13 : భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా కనీస చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాసర్ మండిపడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం సాయంత్రం 4వ డివిజన్ జ్యోతిబసునగర్, 5వ డివిజన్ డబ్బాల్ పెద్ద మోరి, నయీంనగర్ నాలాను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ వర్షాలతో పేదలు పడుతున్న కష్టాలు ప్రభుత్వ పెద్దలకు తెలియకపోవడం, తెలుసుకోక పోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నగరంలోని బస్తీలు నీట మునిగితే ఇప్పటివరకు మున్సిపల్, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొనడం లేదన్నారు. జ్యోతిబసునగర్లో వరద నీటిని తోడేందుకు జేసీబీ పంపాలని అధికారులను అడిగితే డీజీల్ లేదని సమాధానం చెప్పడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటామని దాస్యం హామీ ఇచ్చారు. 2020లో నగర చరిత్రలో ఎన్నడూ చూడని వరదలు సంభవించాయని, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.250 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించిందని దాస్యం గుర్తుచేశారు. రూ.75 కోట్లతో సమ్మయ్యనగర్ నాలాను అభివృద్ధి చేశామని, అందుకే ఇవాళ హనుమకొండలోని ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరారు. ఎవరికైనా ఆపద ఉంటే బీఆర్ఎస్ శ్రేణులను సంప్రదించాలని దాస్యం ఓరుగల్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వరదలు వస్తాయని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీస ముందస్తు చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బొంగు అశోక్‌యాదవ్, సంకు నర్సింగ్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, నాయకులు మనోజ్ కుమార్, సదాంత్, ప్రణయ్, రామ్మూర్తి, జయరాం, దశరథ్, మనోహర్, శ్యామ్, మహమూద్, రాంచందర్, రాజు, వినీల్‌రావు, విజయ్‌రెడ్డి, మహేందర్, రవి, వీరస్వామి, ఖుద్దూస్, రాజేశ్, రమేశ్, సుధాకర్, జేకే తదితరులు పాల్గొన్నారు.