ములుగు, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక అధికారుల పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 7 నుంచి 15 వరకు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం ‘ప్రత్యేక అధికారులతో గ్రామ పంచాయతీల పాలన’ అనే అంశంపై ములుగు కలెక్టరేట్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేకాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత గ్రామాల దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు.
ఉపాధి హామీ కింద మంజూరయ్యే పనులను గ్రౌండింగ్ చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందన్నారు. ప్రత్యేక అధికారులకు గ్రామాలపై సంపూర్ణ భాధ్యత, హక్కులుంటాయని, పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన పెంచుకొని సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించచారు. పారిశుధ్య కార్యక్రమాల్లో మహిళలు, యువతను భాగస్వామ్యం చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. చివరి రోజున గ్రామ సభలు నిర్వహించి పారిశుధ్య కార్మికులను సన్మానించాలని సూచించారు.
మేడారం మహా జాతరలో ప్లాస్టిక్‌ను తగ్గించేలా చర్యలు చేపట్టామని, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే మినీ జాతరల్లో సైతం వినియోగించకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడుతూ ప్రత్యేక అధికారులకు కలెక్టర్లు పంచాయతీ రాజ్ చట్టంపై ఒక రోజు శిక్షణ నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, పంచాయతీరాజ్ డైరెక్టర్ హన్మంతరావు, అదనపు కలెక్టర్ శ్రీజ, డీపీవో వెంకయ్య, డీఆర్డీవో నాగపద్మజ, జడ్పీ సీఈవో ప్రసూనారాణి, అధికారులు పాల్గొన్నారు.