మరిపెడ, ఏప్రిల్ 20 : మక్కజొన్న సాగు రోజు రోజుకు భారంగా మారుతున్నది. పెట్టుబడులు గణనీయంగా పెరగడంతో పాటు, మార్కెట్లో లభిస్తున్న ధర రైతులకు నిరాశే మిగులు తున్నది. చివరికి పంట అమ్ముకునేందుకు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేస్తుండడంతో రవాణా భారం సైతం పెరుగుతున్నది.
అధికారుల అత్యుత్సాహమో.. మరెవరిదైనా ఒత్తిడో.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి సు మారు 8 కిలోమీటర్ల దూరంలోని బురహాన్పురంలో సెంటర్ ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తున్నది. ఆయా గ్రామాల నుంచి మండల కేంద్రానికి సుమారు 10 నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో కొనుగోలు కేంద్రం ఉండడంతో ఆయా గ్రామాల నుంచి సుమారు 20 నుంచి 22 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తున్నది.
ఈసారి మండలంలోని ఎడ్జెర్ల, గుర్పతండా, లచ్చతండా, ఎల్లంపేట, ఉల్లేపల్లి, భూక్యా తండా, వీరారం, తండా ధర్మారం, బాల్ని ధర్మారం, పురుషోత్తమాయగూడెం, బీచ్రాజ్పల్లితో పాటు పలు గ్రామాల రైతులు 8,968 ఎకరాల్లో మక్కజొన్న సాగు చేశారు. గతంలో పంటను మండల కేంద్రానికి తరలించేందుకు ట్రాక్టర్కు రూ.వెయ్యి కిరాయి చెల్లించేవారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలంటే ట్రాక్టర్ కిరాయి రూ.2 వేల నుంచి రూ.2,500 చెల్లించాల్సి వస్తున్నది.
దీనికి తోడు కొనుగోలు కేంద్రం వద్ద ఐదెకరాల స్థలం మాత్రమే అందుబాటులో ఉండడంతో రైతులు తెచ్చిన మక్కలు పోసుకునేందుకు సరిపోవడంలేదు. రైతుల అవస్థలు కొనుగోలు కేంద్రాన్ని మారుమూల గ్రామంలో ఏర్పాటు చేయడంతో రైతులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా రోజుల తరబడి అక్కడే ఉండాల్సి రావడంతో తాగునీరు, భోజనంతో పాటు టీ కూడాదొరకని పరిస్థితి ఉంది. నీడ ఏర్పాటు చేయకపోవడంతో ఎండ తీవ్రతకు చెట్లను ఆశ్రయించాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రం అందుబాటులో లేకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు పంటను అమ్ముతూ నష్టపోతున్నారు. అప్పులు తెచ్చి రైతులు ఎకరాకు రూ.40 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. చేతికొచ్చిన పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడంలేదు. దీంతో అప్పులు తీర్చేందుకు దళారులకు క్వింటాకు రూ.1,600 నుంచి రూ.1,800కే విక్రయించాల్సి వస్తున్నది. ఒక్కో రైతు క్వింటాకు రూ.600 నుంచి రూ.800 వరకు నష్టపోవాల్సి వస్తున్నది.