ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అకాలవర్షం తుడిచిపెట్టుకుపోవడంతో ఆందోళనలో పడ్డ అన్నదాతల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా నింపారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలిస్తూ.. బాధిత రైతులతో మాట్లాడి వారికి ధైర్యాన్నిచ్చారు. రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్ రెడ్డి, సత్యవతిరాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారయంత్రాంగంతో కలిసి పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా, దుగ్గొండి మండలం అడవిరంగాపురంలో సీఎం కేసీఆర్ గురువారం పర్యటించి, పంట నష్టాన్ని కళ్లారా చూసి చలించిపోయారు. ఏ రకం పంట అయినా ఎకరాకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. కేంద్రం ఎలాంటి సాయం చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకుంటున్నామని స్పష్టం చేశారు. ఓ వైపు జ్వరంతో బాధపడుతూనే ఎండలో నడిచివచ్చి తమకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
Cmkcr Warangal1
వరంగల్, మార్చి 23 (నమస్తే తెలంగాణ)/నర్సంపేట/నర్సంపేట రూరల్/దుగ్గొండి : ఇటీవల అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడుతూ వారిలో ధైర్యం నింపారు. ఏ రకం పంట అయినా ఎకరాకు రూ.10వేల చొప్పున ఆర్థికసాయం చేస్తామని చెప్పారు. కౌలు రైతులకు సైతం నష్ట పరిహారం అందిస్తామన్నారు. ముందుగా మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాకు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు చేరుకున్నారు.
ఏరియల్ సర్వే చేసి హెలిక్యాప్టర్ దిగిన సీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద ఉంచి ప్రత్యేక బస్సులో దెబ్బతిన్న చేన్ల వద్దకు చేరుకున్నారు. రైతు జాటోత్ చిన్న సోమ్లానాయక్ చేను వద్దకు వెళ్లి పంట నష్టం ఎంత అయిందో తెలుసుకున్నారు. ‘ఇప్పుడు చేను మీద ఉన్న కంకి ఏమైనా అక్కెరకు వస్తుందా’ అని అడిగి తెలుసుకున్నారు. ‘అధైర్యపడవద్దు నేనున్నా’నంటూ భరోసా కల్పించారు.
పక్కనే మిరప పంట వేసిన జాటోత్ సోమ్లానాయక్ తో మాట్లాడారు. నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ‘తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, పుష్కలంగా నీళ్లు ఇస్తున్నది. ఇప్పుడు వడగండ్ల వానతో నష్టం కలిగిందని బాధపడొద్దు.. ధైర్యం ఉండాలె.. మరో పంటకు సిద్ధం కావాలె’ అంటూ రైతు భుజాలపై చేతులు వేసి ధైర్యాన్నిచ్చారు. సమీపంలో ఉన్న మామిడి తోటలో తిరుగుతూ నేల రాలిన మామిడి కాయలను పరిశీలించారు. మామిడి రైతు నెహ్రూనాయక్‌తో మాట్లాడి ఎంత మేరకు నష్టం వాటిల్లిందో అడిగి తెలుసుకున్నారు. నష్టం వివరాలను సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
Cmkcr Warangal2
సభ సమీపంలో జిల్లా పౌరసంబంధాల శాఖ ఏర్పాటు చేసిన పంట నష్టం ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం తిలకించి, వేదికపై నుంచి రైతులనుద్దేశించి ప్రసంగించారు. నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 10వేలు ఇస్తామని చెప్పగానే రైతులు హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టారు. అనంతరం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం అడవి రంగాపురానికి హెలిక్యాప్టర్‌లో చేరుకున్నారు. ముందుగా ఏరియల్ సర్వే చేశారు. అనంతరం హెలిప్యాడ్ వద్ద దిగి, ప్రత్యేక వాహనాల్లో పంట చేల వద్దకు చేరుకున్నారు. మక్క రైతులు బొంపెల్లి రజినీకర్‌రెడ్డి, హైమావతి, రాజిరెడ్డితో మాట్లాడారు.
తాము ఐదున్నర ఎకరాల్లో మక్క సాగు చేసినట్లు తెలుపగా సీఎం స్వయంగా పరిశీలించారు. చేనులో ప్లాస్టిక్ వాటర్ పైపు వడగండ్ల ధాటికి ముక్కలు కావడాన్ని గ్రహించారు. చేను పక్కనే వడగండ్లతో ధ్వంసమైన టేకు చెట్లను పరిశీలించారు. రైతులు సింగతి లక్ష్మి, సామ్రాజ్యం,లక్ష్మీనారాయణకు చెందిన వరి పంటను పరిశీలించి వారితో మాట్లాడారు. ‘వర్షం ఎప్పుడు కురిసింది’ అని అడుగగా ‘రాత్రి ఒంటి గంట సమయంలో పడిందని, మధ్యాహ్నం పడి ఉంటే ఆ ధాటికి తాము బతుకకపోతుంటిమి’ అని రైతులు వాపోయారు.
ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు భయపడి వ్యవసాయాన్ని వెనుకకు తీసుకోవద్దని రైతులకు సీఎం ధైర్యం చెప్పారు. అరెకరం టమాట తోటను నష్టపోయిన రైతు అమరేందర్తోనూ మాట్లాడి భరోసానిచ్చారు. రైతులకు ధైర్యం చెప్పేందుకే ఇంత ఎండల బడి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. రైతులెవరూ ఆధైర్యపడొద్దని, ధైర్యంతో వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవాలని, ప్రభుత్వం అన్ని విధాలా సాయపడుతుందని తెలిపారు.
పంట నష్టంపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం హెలిప్యాడ్ వద్ద సమాచార, పౌరసంబంధాల శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను చూశారు. వడగండ్లతో దెబ్బతిన్న మక్క, వరి, టమాట, అరటి తదితర పంటల కర్రలను చూశారు. ‘కష్టపడి బాగు చేసుకున్న వ్యవసాయాన్ని రక్షించుకునేందుకే దెబ్బతిన్న పంటలను పరిశీలించి భరోసా కల్పించేందుకు నేను ఇక్కడికి వచ్చా’నని చెప్పారు. పంట నష్టం వివరాలను కలెక్టర్ ప్రావీణ్యను అడిగి తెలుసుకున్నారు.
Cmkcr Warangal3
జ్వరంతో మండుటెండలో..
దాదాపు మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సీఎం కేసీఆర్ తన అనారోగ్యాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా రైతుల కోసం వచ్చి భరోసా కల్పించారు. ఆద్యంతం ఎండలోనే క్షేత్రస్థాయిలో కాలినడకన పంటలను పరిశీలించారు. రెడ్డికుంట తండాలో పర్యటన ముగించుకొని అడవిరంగాపురం బయలుదేరేముందు తన వెంట తెచ్చుకున్న సద్ది అన్నాన్ని క్యారవ్యాన్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి తిన్నారు.
సీఎం కేసీఆర్‌తోనే సస్యశ్యామలం : మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్‌తోనే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమైంది. రైతులకు అన్ని విధాలా సాయం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని నివేదికలతో వచ్చిన్రు. కేసీఆర్ వల్లే రైతులకు సరిపడా నీళ్లు వస్తున్నయ్. గతంలో కరంటు సరిగా రాక మోటర్లు కాలి రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డరు. నేడు సీఎం కేసీఆర్ నాణ్యమైన ఉచిత కరంటు, పెట్టుబడి సాయం అందిస్తున్నరు. ఇంతకు ముందు ఈ ప్రాంతమంతా కరువుతో ఉండేది. కేసీఆర్ సార్ దయతోనే అన్ని విధాలా బాగుపడుతున్నం. అప్పుడు ఎకరానికి రూ.5లక్షలు ఉంటే ఇప్పుడు రూ.10-15లక్షలు పలుకుతున్నదంటే సీఎం కేసీఆర్ మేలు వల్లే..
స్వయంగా వడ్డించిన మంత్రి
క్యారవ్యాన్‌లో సీఎంతో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వయంగా కూరలు, పులిహోర వడ్డించారు. సీఎం ఎక్కడా రాజకీయ అంశాలకు తావివ్వకుండా నేరుగా రైతులతో మాట్లాడేందుకు, రైతుల గురించి మాట్లాడేందుకే ప్రాధాన్యమిచ్చారు. మొత్తాన్ని కొన్ని గంటల్లోనే పరిహారం జీవోను సీఎం విడుదల చేయడంపై రైతులు ఆనందం వెలిబుచ్చారు.
సీఎం పర్యటనలో మంత్రులతో పాటు ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, టీ రాజయ్య, డీఎస్ రెడ్యానాయక్, శంకర్‌నాయక్, జడ్పీ అధ్యక్షులు గండ్ర జ్యోతి, అంగోత్ బిందు, వైస్ చైర్మన్ ఏ శ్రీనివాస్, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, కలెక్టర్లు ప్రావీణ్య, శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్లు శ్రీవత్స, అశ్విని తానాజీ, డేవిడ్, అభిలాషా అభినవ్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్‌రావు, ఎంపీపీ రాజేశ్వరి, జడ్పీటీసీ జ్యోతిర్మయి, పాలకుర్తి దేవస్థానం చైర్మన్ రామచంద్రయ్యశర్మ పాల్గొన్నారు.
కేసీఆర్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు
సీఎం కేసీఆర్‌ను చూసేందుకు హెలిప్యాడ్ల వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు. రెండు చోట్లా కేసీఆర్ మాటలను వినేందుకు ఎగబడ్డారు. బంగ్లాలు, చెట్లు ఎక్కి కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. హెలిక్యాప్టర్ దిగేముందు, వెళ్లేముందు, బస్సులో వస్తున్నప్పుడు సీఎం కేసీఆర్‌కు అభివాదం చేశారు.