చెన్నారావుపేట : అకాల వర్షాలతో అన్నదాతలు సతమతమైపోతున్నారు. గత రాత్రి చెన్నారావుపేట మండల వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిచి రైతులు నష్టపోయారు. మండలంలోని చాలా కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం రాశులపై టార్పాలిన్ కవర్లు కప్పినప్పటికీ గాలులకు కొట్టుకు పోయి వడ్లు తడిసాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చిందని సంతోషంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులకు అనుకోకుండా కురుస్తున్న వర్షాలతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
వర్షాలకు తోడు కొనుగోలు కేంద్రాలలో కాంటాలు ఆలస్యం అవడంతో వర్షాలకు ధాన్యం తడుస్తుందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకస్మిక వర్షాలు కురుస్తున్న వేళ మాచెర్ తో సంబంధం లేకుండా త్వరగా కాంటా నిర్వహించి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు.