రైతన్నపై ప్రకృతి కన్నెర్రచేసింది. చేతికొచ్చే వేళ పంటలను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేసింది. ఈదురుగాలులు, వడగండ్ల ధాటికి కోతకు వచ్చిన వరి గింజలు, మామిడి కాయలు నేలరాలగా, మక్కజొన్న, అరటి చెట్లు నేలవాలి నిండా ముంచింది. రెండు రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టిస్తుండగా సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం మానుకోట, ములుగు జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం మిగిల్చి అన్నదాతను ముంచింది. గత ఏడాది వానకాలంలో పెను వరదల ప్రభావం నుంచి ఇంకా కోలుకోని మానుకోట రైతుకు ప్రస్తుత వర్షాలు మరింత అగాథంలో నెట్టేశాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు మండలాల్లో పంటలు వర్షార్పణం కావడమే గాక భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, రేకుల ఇండ్లు దెబ్బతినడంతో జనజీవనం అతలాకుతలమైంది.
– మహబూబాబాద్/ములుగు, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ)
గతేడాది ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో కురిసిన అతి భారీ వర్షాలు మహబూబాబాద్ జిల్లాను అతలాకుతలం చేశాయి. అప్పుడు చెరువులు, చెక్‌డ్యాములు, రోడ్లు కొట్టుకుపోయి, ఇండ్లు ఆగమైన సర్వం కోల్పోయిన ప్రజలు.. ఇంకా ఆ గాయం నుంచి కోలుకోకముందే ప్రకృతి మారోమారు విరుచుకుపడింది. సోమవారం రాత్రి అకాల వర్షం ప్రభావంతో మరిపెడ, సీరోలు మండలాలు మినహా జిల్లాలోని అన్ని మండలాల్లో పంట నష్టం జరిగింది. ఇప్పటికే సాగునీరు లేక రైతులకు సగం పంట ఎండిపోయిన పంటలు..
ఉన్న కొద్దోగొప్పో పంటలైనా తిండి మందం వస్తాయనుకుంటే ఈదురుగాలులు, వడగండ్లకు కొట్టుకుపోయి రైతుల కడుపు కొట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 16 మండలాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 140మంది మామిడి రైతులది 473 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిన్నది. ఇద్దరు రైతులకు సంబంధించిన 5 ఎకరాల బొప్పాయి, మరో ఇద్దరు రైతులకు సంబంధించిన 4ఎకరాల సపోట దెబ్బతిన్నది.
జిల్లావ్యాప్తంగా 1,685మంది రైతులకు సంబంధించిన 2,686 ఎకరాల్లో వరి నష్టం జరిగిందని అంచనా వేశారు. 71మంది రైతులకు సంబంధించిన 130 ఎకరాల మక్కజొన్న దెబ్బతిన్నదని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వాస్తవానికి అంతకంటే రెట్టింపు నష్టం జరిగిందని అధికారులు మరికొన్ని రోజులు క్షేత్ర స్థాయిలో సర్వే చేయాలని రైతులు కోరుతున్నారు. ఈదురుగాలులతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి కేసముద్రం వెళ్లే మార్గమధ్యలో ఈదులపూసపల్లి వద్ద చెట్లు కూలడంతో రాత్రి వేళల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
జిల్లాకేంద్రంలోని కంకరబోర్డు వద్ద ఉన్న ఒక ప్రైవేట్ కళాశాల వద్ద విద్యుత్ స్తంభం కూలీపోవడంతో తెల్లవారే వరకు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. ప్రభుత్వం తమకు పూర్తి మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 86.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 5.4 మిల్లిమీటర్లుగా నమోదైంది. గంగారం-5.2, మహబూబాబాద్-20.2, నెల్లికుదురు 27.8, చిన్నగూడురు-1.0, మరిపెడ-9.6, తొర్రూరు-6.4, పెద్దవంగర-7.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.
9,110 ఎకరాల్లో పంట నష్టం
ములుగు, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాలో సోమవారం గాలిదూమారంతో కూడిన అకాల వర్షానికి 9,110 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈమేరకు మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు వివరాలను వెల్లడించారు. జిల్లాలో ములుగు, గోవిందరావుపేట, మంగపేట, ఏటూరునాగారం, వెంకటాపురం(నూగూరు) మండలాల్లో 4,804 మంది రైతులకు చెందిన 9,110 ఎకరాల్లో ఈ నష్టం వాటిల్లిందని వివరించారు.
2002మంది రైతులకు చెందిన 1860 ఎకరాల వరి పంటకు, నలుగురు రైతులకు చెందిన 10 ఎకరాల మక్కజొన్న, 109మంది రైతులకు చెందిన 148ఎకరాల మామిడి, 29మంది రైతులకు చెందిన 44 ఎకరాల అరటి, ఆరుగురు రైతులకు చెందిన 13ఎకరాల బొప్పాయి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదిక రూపొందించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు. ప్రతీ రైతుకు వ్యవసాయ శాఖ తరపున నష్టపరిహారం అందించేలా నివేదికను సమర్పించామని పేర్కొన్నారు.