నిరంతర ఉచిత విద్యుత్, పుష్కలంగా సాగునీరు, రైతు బంధు, పండిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో వ్యవసాయం పండుగలా మారింది. ఇందులో భాగంగా జిల్లాలో యాసంగి పంటల సాగు ఈసారి గణనీయంగా పెరిగింది. గత ఏడాది 1,82,849 ఎకరాలు కాగా.. ఈసారి 1,99,937 ఎకరాల్లో రైతులు పలు రకాల పంటలు వేశారు. వరి పంట 96,726 ఎకరాలు, మక్కజొన్న 84,216, పండ్ల తోటలు, 6,594, పత్తి 273, ఆయిల్‌పామ్ 1,767 ఎకరాల్లో సాగు చేశారు. దీంతో ఈ సీజన్లో పంటల సాగు విస్తీర్ణం రెండు లక్షల ఎకరాలు దాటే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లా చరిత్రలో ఇది రికార్డు అని అధికారులు వెల్లడించారు.
– వరంగల్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ)
వరంగల్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో గత వాన కాలం విస్తారంగా వర్షాలు కురిశాయి. వరద నీటితో జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండిపోయాయి. పలుమార్లు మత్తడి దుంకాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నీటిని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లోకి తరలిస్తోంది. దీంతో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు ఇప్పటికీ నిండుకుండలను తలపిస్తున్నాయి. భూగర్భ జలమట్టం పెరుగడంతో బావులు, బోర్లలో నీరు ఉబికివస్తోంది. దీనికితోడు వ్యవసాయరంగానికి ప్రభుత్వం 24 నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో రైతులు ప్రస్తుత యాసంగి పంటల సాగు విస్తీర్ణం పెంచారు. మునుపెన్నడూ లేని రీతిలో ఈసారి వివిధ పంటలను పోటాపోటీగా సాగు చేశారు. ఫలితంగా రికార్డు స్థాయిలో యాసంగి పంటల సాగు విస్తీర్ణం ఎగబాకింది. గత ఏడాది యాసంగి పంటల సాగు విస్తీర్ణం కంటే ఈ సారి అదనంగా ఇప్పటికే మరో పదిహేడు వేల ఎకరాలకుపైగా పెరిగింది.
సాగు విస్తీర్ణం దాదాపు రెండు లక్షల ఎకరాలకు చేరింది. ప్రధానంగా వరి పంట సాగు విస్తీర్ణం ఇప్పుడు గణనీయంగా పెరుగడం విశేషం. గత యాసంగిలో 1,82,849 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. ఇందులో అత్యధికంగా మక్కజొన్న ఉంది. 84,222 ఎకరాల్లో రైతులు మక్కజొన్న పంట సాగు చేశారు. వరి పంట రెండోస్థానంలో ఉంది. 76,878 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. 7,605 ఎకరాల్లో పండ్ల తోటలు సాగుకాగా ఇందులో మామిడి తోట విస్తీర్ణం 6,326 ఎకరాలు ఉంది. 3,615 ఎకరాల్లో రైతులు కూరగాయల పంటలను సాగు చేశారు. సోయాబిన్, పొద్దు తిరుగుడు వంటి పంటలను 2,605 ఎకరాల్లో సాగు చేశారు. తొలిసారి గత ఏడాది యాసంగిలో 87 ఎకరాల్లో పత్తి పంట వేసి ఆశించిన లాభాలను పొందారు. మక్కజొన్న, వరి పంటల నుంచి కూడా రైతులు మంచి దిగుబడులను సాధించారు. ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసింది. ధాన్యం డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇక మక్కలకు మార్కెట్లో రైతులకు ఆశించిన ధర లబించింది.
ఈసారి పెరిగిన వరి పంట సాగు
ప్రస్తుత యాసంగి వరి పంట సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఏడాది యాసంగి పంటల సాగు విస్తీర్ణంలో జిల్లాలో మక్కజొన్న పంట నంబర్ వన్ స్థానంలో ఉంటే ఈ సారి యాసంగి వరి పంట సాగు విస్తీర్ణం ప్రథమ స్థానానికి చేరింది. మంగళవారం వరకు జిల్లాలో ప్రస్తుత యాసంగి రైతులు 1,99,937 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. నర్సంపేట వ్యవసాయ డివిజన్లోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా రైతులు కొందరు వరి నాట్లు వేస్తున్నారు. దీంతో ఈ యాసంగి జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం రెండు లక్షల ఎకరాలు దాటే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. జిల్లా చరిత్రలో యాసంగి ఇంత విస్తీర్ణంలో పంటల సాగు చేయడం రికార్డుగా అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు నమోదైన పంటల సాగు విస్తీర్ణాన్ని పరిశీలిస్తే 1,99,937 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు.
వరి పంట విస్తీర్ణం 96,726 ఎకరాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత 84,216 ఎకరాల్లో మక్కజొన్న పంట రెండో స్థానంలో ఉంది. గత ఏడాది యాసంగి రైతులు సాగు చేసిన మక్కజొన్న పంట కంటే ఈసారి మక్కజొన్న పంట విస్తీర్ణం కేవలం ఆరు ఎకరాలు తక్కువగా ఉండడం గమనార్హం. ప్రస్తుత యాసంగిలో 6,594 ఎకరాల్లో రైతులు పండ్ల తోటలను సాగు చేశారు. ఇందులో మామిడి తోట విస్తీర్ణం 5,832 ఎకరాలు ఉంది. మిగిలినది అరటి, సపోట, ఆరెంజ్ తదితర తోటల విస్తీర్ణం. 2,579 ఎకరాల విస్తీర్ణంలో ఈసారి కూరగాయల పంటలను సాగు చేశారు. ఈ యాసంగి పత్తి సాగు విస్తీర్ణం 273 ఎకరాలకు పెరిగింది. ముఖ్యంగా జిల్లాలో తొలిసారి ఈ యాసంగి రైతులు 1,767 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశారు. వరి నాట్లు వేయడం కొనసాగుతున్నందున జిల్లాలో ఈ యాసంగి వరి పంట సాగు విస్తీర్ణం సుమారు లక్ష ఎకరాలకు చేరవచ్చని వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు.
రాయపర్తి మండలం టాప్
యాసంగి వరి పంట సాగు విస్తీర్ణంలో ఈసారి జిల్లాలో రాయపర్తి మండలం టాప్‌లో ఉంది. 13 మండలాల్లో ఇక్కడ అత్యధికంగా 21,289 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. ఆ తర్వాత పర్వతగిరి రెండు, వర్ధన్నపేట మూడో స్థానంలో ఉన్నాయి. పర్వతగిరి మండలంలో 16,100, వర్ధన్నపేట మండలంలో 14,564 ఎకరాల్లో రైతులు యాసంగి వరి పంట సాగు చేశారు.
మండలాల వారీగా పంటల సాగు వివరాలు..
చెన్నారావుపేటలో 4,655 ఎకరాలు, దుగ్గొండిలో 3,929, ఖానాపురంలో 6,254, నల్లబెల్లిలో 4,850, నర్సంపేటలో 2,500, నెక్కొండలో 9,765, గీసుగొండలో 2,596, ఖిలావరంగల్‌లో 2,467, పర్వతగిరిలో 16,100, రాయపర్తిలో 21,289, సంగెంలో 7,386, వరంగల్‌లో 356, వర్ధన్నపేటలో 14,564 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేశారు. నీరు సమృద్ధిగా ఉండడం, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో యాసంగి పంటల సాగు విస్తీర్ణం పెరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.