మడికొండ : పోలీసులు నిజాయితీగా పని చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం తొలిసారి మడికొండ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ముందుగా స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాల కంట్రోల్ రూంలో కెమెరాల పనితీరు, వివిధ రికార్డు గదులను పరిశీలించి పలు రికార్డులను తనీఖీ చేశారు. స్టేషన్ పనీతీరుతో పాటు స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు జరుగుతాయి, ఎంత మంది రౌడీ షీటర్లు ఉన్నారనే అంశాలపై ఆరా తీశారు.
అనంతరం సీపీ మాట్లాడుతూ పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా నిజాయితీ పనిచేయాలని, ఫిర్యాదులుపై వేగంగా స్పందించాలని సూచించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ పరిధిలో హన్మకొండ హైదరాబాద్ ప్రధాన రోడ్డు మార్గం ఉండటం ద్వారా ప్రమాదాల నివారణకు ముందస్తూ చర్యలు తీసుకోవాలని, నేరాల నియంత్రణలో నిరంతరం అప్రమత్తంగా వుండాలన్నారు. సీపీ వెంట కాజీపేట ఏసీపీ తిరుమల్, ఎస్ఐ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.