హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 5 : హనుమకొండలో అవినీతి జలగలు విద్యాశాఖను పట్టిపీడిస్తున్నాయి. ప్రతి పనికీ ధర నిర్ణయించి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, నిబంధనలు పాటించని ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి నెలనెలా డబ్బులు వసూలు చేసి రూ.లక్షలు వెనకేస్తున్నారు. గతంలో డీఈవో వాసంతిపై అవినీతి ఆరోపణలు రావడంతో రిమూవల్ చేశారు. డైట్ ప్రిన్సిపాల్‌గా ఉన్న అబ్దుల్‌హై అక్రమాలపై ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదు చేయడంతో ఇటీవల బదిలీ చేసి న విషయం తెలిసిందే.
ఇటీవల ఇన్చార్జి డీఈవో గా బాధ్యతలు స్వీకరించిన అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి ప్రైవేట్ పాఠశాల అనుమతులకు సంబంధించి రూ. లక్ష డిమాండ్ చేసి అందులో రూ.60 వేలు విద్యాశాఖ సీనియర్ అసిస్టెంట్ గౌస్, జూనియర్ అసిస్టెంట్ మనోజ్ ద్వారా తీసుకుంటుండగా పట్టుబడడం సంచలనంగా మారింది. మండలాల్లోని విద్యాశాఖాధికారులపై కూడా ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఉన్నతాధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు.
నిబంధనలు పాటించని ఒక్కో పాఠశాల నుంచి రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు లంచం తీసుకొని అనుమతులను పునరుద్ధరిస్తున్నారు. మూడో అంతస్తులో ఉన్న, కొత్త పాఠశాల లకు అనుమతి ఇవ్వాలంటే చేయి తడపాల్సిందే. ప్రభుత్వ ఉపాధ్యాయులు వ్యక్తిగత పనులకు సెలవు తీసుకుని.. వాటిని మెడికల్ లీవ్‌గా మార్చుకునే విషయంలో ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు.