ఖిలావరంగల్: వరంగల్ జిల్లా (Warangal) వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా భారీ వాన కురుస్తున్నది. గురువారం రాత్రి ప్రారంభమైన వర్షం శుక్రవారం ఉదయం వరకు సాధారణ నుంచి భారీ వర్షం కురిసింది. గీసిగొండలో 92.9 మిల్లీమీటర్లు, వరంగల్ లో 70.9 మిల్లీమీటర్లు, ఖిలావరంగల్ లో 65.3 మిల్లీమీటర్ల భారీ వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వర్ధన్నపేటలో 55.8 మిల్లీమీటర్లు, నెక్కొండలో 55.4 మిల్లీమీటర్లు, పర్వతగిరిలో 53.8 మిల్లీమీటర్లు, ఖానాపూర్ లో 40.3 మిల్లీమీటర్లు, నర్సంపేటలో 40.0 మిల్లీమీటర్లు, చెన్నారావుపేటలో 39.3 మిల్లీమీటర్లు, సంగెమ్ లో 32.2 మిల్లీమీటర్లు, దుగ్గొండిలో 28.8 మిల్లీమీటర్లు, నల్ల పెళ్లిలో 25.7 మిల్లీమీటర్లు, రాయపర్తి లో 21.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే జిల్లాలో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సత్య శారద
వరంగల్ జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ (IMD) హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద (Satya Sharada) ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో తన క్యాంపు కార్యాలయం నుంచి ఆదనవు కలెక్టర్, జిల్లా, మండల స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాల కారణంగా అత్యవసర సహాయార్ధం ప్రజలు వరంగల్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్.1800 425 3424, మొబైల్ నంబర్ 9154252936ను సంప్రదించాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా జిల్లా మండల అధికారులు, ముఖ్యంగా తహశీల్దార్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఎంపీడీవోలు, తహసిల్దార్లు తమ మండల పరిధిలోని ముంపు ప్రాంతాలను పర్యవేక్షిస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద సూచిక బోర్డులు పెట్టాలన్నారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందించాలని కోరారు. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉంటుందని, కావున రోడ్డు రవాణా విద్యుత్ సరఫరా లో అంతారం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ, విద్యుత్, రోడ్ల భవనాల శాఖ అధికారులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.
వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టాలని, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేపట్టాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు వారి పరిధిలోని చెరువులను నిత్యం పర్యవేక్షిస్తూ ఏదైనా అత్యవసర మరమ్మతులు ఉన్నట్లయితే యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు తాము పని చేసే చోటనే 24 గంటల పాటు అందుబాటులో ఉండాలంటూ ఆదేశించారు. పారిశుద్ధ్య, ఆరోగ్య సమస్యల పరంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ ముంపు సమస్యలపై శ్రద్ధ దృష్టి పెట్టాలన్నారు. ఏమైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.
ఈ టెలి కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిషత్ సీఈవో రామిరెడ్డి, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, పంచాయతీ , అగ్నిమాపక, బల్దియా, కుడా, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.