కరీమాబాద్, అక్టోబర్ 26 : విధుల పేరుతో వెట్టిచాకిరి చేయిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ వరంగల్ జిల్లా మామునూరులోని 4వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్లు శనివారం నిరసన చేపట్టారు. మొదటగా బెటాలియన్‌లోని క మాండెంట్ కార్యాలయం ఎదుట ఏక్ పోలీస్ ఆకారంలో బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయం నుంచి ర్యాలీగా తరలివచ్చి బెటాలియన్ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన ఆందోళనకు దిగారు.
ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని నినాదాలు చేశారు. లా అండ్ ఆర్డర్ విధుల్లో తమ సేవలు వినియోగించుకోవాలని, తమకు సంబంధం లేని పనులు చేయించొద్దని కోరారు. ఇటీవల కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు ధర్నా చేసిన విషయం ప్రజల్లో చర్చ జరుగుతున్న సమయంలోనే రాష్ట్రంలో మొదటిసారిగా కానిస్టేబుళ్లు యూనిఫాం ధరించి నిరసన చేపట్టడం అటు హోంశాఖతో పాటు ఇటు ప్రజల్లో తీవ్ర చర్చగా మారింది.
తమకు న్యాయం చేయాలని, న్యాయమైన కోరికలను తీర్చాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమం చేస్తున్న సిబ్బందితో కమాండెంట్ రాంప్రకాష్, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మాట్లాడారు. కానిస్టేబుళ్ల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసనను తాత్కాలికంగా వాయిదా వేశారు. హామీలు అమలు చేయడంలో ఇబ్బందులు సృష్టిస్తే తిరిగి పెద్ద ఎత్తున నిరసన చేపడతామన్నారు.