హనుమకొండ, మే 3 : కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తమ అసంతృప్తిని వెల్లగక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీటి పారుదల, పౌర సరఫరా శాఖలపై సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతకతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహ రి, రాంచంద్రునాయక్, గండ్ర సత్యనారాయణతో పాటు ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు సక్రమంగా లేవని ఏకరువు పెట్టారు.
ముఖ్యంగా వడ్లు కాంటాలు అయిన తర్వాత కేంద్రాల్లో ఉంటున్నాయని, తూకం వేసినప్పటి నుంచి మిల్లులకు చేరే వరకు చాలా సమయం పడుతున్నదన్నారు. చాలాచోట్ల గన్నీ సంచులు, టార్పాలిన్స్, లారీలు అందుబాటులో ఉండటం లేదన్నారు. పొద్దంతా ఎండకొట్టి సాయంత్రం కాగానే అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యం తడిసిపోయి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. రవాణా చేసేందుకు లారీలు సరిగా రావ డం లేదన్నారు. సన్నధాన్యానికి సంబంధించి బోనస్ ఇవ్వడం లేదని, కాంటా పెట్టి 15 రోజులైనా ధాన్యం తరలించడం లేద ని రైతులు ఆందోళన చెందుతున్నారని ఎమ్మెల్యేలు వివరించారు.
అంతేగాక గన్నీ సంచుల విషయంలో పర్యవేక్షణ సక్రమంగా లేదని, కొనుగోలు చేసి న తర్వాత వడ్లు తరలించకపోవడంతో వర్షాలు పడి నీళ్లలో కొట్టుకపోతున్నాయని, ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో మిల్లు ల కేటాయింపు జరుగలేదని విషయాన్ని కలెక్టర్, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని ఎమ్మెల్యేలు.. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ధాన్యం ఎప్పటికప్పుడు తరలించేలా, సరిపడా గన్నీ సంచులు, టార్పాలిన్లు అండుబాటులో ఉండే లా, రైతులకు ధాన్యం డబ్బులు త్వరగా ఖాతాల్లో జమ చేసేలా అధికారులను ఆదేశించాలని వారు కోరారు.
ఇరిగేషన్ శాఖ అధికారుల పనితీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలు తప్పుపట్టారు. సమస్యలున్నాయని ఎస్ఈ, డీఈ, ఏఈలకు చెప్పినా పట్టించుకోవడం లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో విధులు నిర్వహిస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులు ఇన్ ఆక్టీవ్‌గా ఉంటున్నారని ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ మంత్రికి వివరించారు. వారి వద్ద పూర్తిస్థాయి సమాచారం ఉండడం లేదన్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు పనితీరు మెరుగుపరుచుకొనేలా ఆదేశాలు జారీ చేయాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు.
దేవాదుల ప్రాజెక్టు కు అవసరమైన నిధు లు కేటాయించి రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఇప్పుటివరకు రెండున్నర లక్షల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. వరంగల్ జిల్లాలో సాగునీటి పారుదల శాఖ అభివృద్ధి పనుల పురోగతి, పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్షించేందుకు జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో వడ్లు పండించామని మంత్రి తెలిపారు. దొడ్డు రకం ధాన్యానికి మద్ద తు ధర, సన్నధాన్యానికి మద్దతు ధర, రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. రెండు సీజన్లలో తెలంగాణలో పండినంత ధాన్యం ఉమ్మడి రా ష్ట్రంలో పండలేదన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని, ఈ ప్రక్రియ నిరంతరం ఉంటుందన్నారు.
-మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
ఉమ్మడి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను పూర్తి చేస్తామని జిల్లా ఇన్చార్జి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గాల్లోని సమస్యలను తెలుసుకొని పరిషరించేందుకు అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు. మంత్రి సీతక మాట్లాడుతూ ములుగు జిల్లాలో గిరిజన గ్రామాలు, వాగులు ఉన్నందున చెక్‌డ్యామ్‌లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో సాగునీటి కాల్వల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, అద్వైత్‌కుమార్ సింగ్, దివాకర టీఎస్, రిజ్వాన్ బాషా షేక్, రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్లు, సాగునీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.
-ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
వరంగల్, మే 3 : భద్రకాళీ చెరువు పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు అదేశించారు. శనివారం చెరువు పనులను వారు పరిశీలించి ఇప్పటివరకు తీసిన పూడికతీత వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే జూన్ 15 నాటికి పనులు పూర్తిచేయాలన్నారు. అనంతరం భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు.