కరీమాబాద్, జూలై 12 : రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 32వ డివిజన్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి సుమారు వందమంది నాయకులు, కార్యకర్తలు నన్నపునేని సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా నన్నపునేని వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం నరేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తుండడంతోపాటు తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నందున ప్రజలు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికీ సముచితం స్థానం కల్పిస్తామన్నారు. బీఆర్ఎస్ను తూర్పులో బలోపేతం చేస్తామన్నారు. పార్టీలోని కొత్త.. పాత అని తేడా లేకుండా నాయకులు కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల కుటిల రాజకీయాలు ప్రజలకు తెలుసన్నారు. కేసీఆర్ సర్కార్తోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పొగాకు సందీప్, పరదేశి రాజేశ్, దోనికల ప్రవీణ్, దస్తగిరి, పసునూరి సువర్ణ, సీతారాయుడు, మాటేటి శ్యామ్, నూక రమేశ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.