వరంగల్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ డ్రామాకు బీఆర్ఎస్ అనూహ్య చెక్ పెట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో ఇసుక మాఫియా ఆగడాలను గులాబీ పార్టీకి అంటగట్టబోయి బొక్కబోర్లాపడింది. దీంతో నియోజ కవర్గంలోని గులాబీ శ్రేణులు ఒక్కసారిగా మెరుపు ఆందోళనకు దిగడంతో హస్తం పార్టీ తోకముడిచింది. పోలీస్ యంత్రాంగం సైతం ఒకింత ఆశ్చర్యానికి గురైంది. కాంగ్రెస్ వర్గపోరే ఇంతదూరం తెచ్చిందా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘అనుకున్నదొక్కటీ..అయినది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే..’ అని భూపాలపల్లి కాంగ్రెస్ తలపట్లు పట్టింది. జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన 22నెలలుగా ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూలేకుండా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ఆగడాలను ప్రజల ముందు ఉంచుతుంది. ప్రత్యేకించి భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల ఇసుక దంచుడు వ్యవహారాన్ని బీఆర్ఎస్ ఎండగడుతున్నది.బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలతో కాంగ్రెస్కు కంటిమీద కనుకులేకుండా తయారైందనే అభిప్రాయం నెలకొన్నది. మరోవైపు కాంగ్రెస్ వర్గపోరుతో కొట్టుమిట్టాడు తున్నది.
నియోజకవర్గంలో వర్గపోరు ఏ స్థాయిలో ఉందో చెప్పే ఉదంతాలు గతంలో అనేకం వెలుగు చూశాయి. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వర్సెస్ ఆయన వ్యతిరేకవర్గం అన్ని మండలాల్లో ‘నువ్వా..నేనా’ అన్నట్టు రూపుదాల్చింది. పొసగని అనేక అంశాల ప్రభా వం తారాస్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం ఉన్నట్టుండి రోడ్డు మీదికి వచ్చి ఆందోళన చేపట్టింది. ఈ చర్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో గాంధీభవన్, సీఎంవో నుంచి ఎమ్మెల్యే వర్గాన్ని మందలించి, అవతలివర్గానికి నచ్చజెప్పే ప్రయత్నం చేయడమే కాకండా ఈ చర్యను దారిమళ్లించి బీఆర్ఎస్కు ఎగదోయాలనే సలహా ఇచ్చినట్టు నియోజకవర్గంలో ప్రచారం సాగుతున్నది. అయితే, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఇసుక మాఫియా ఆగడాలపై శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపడతామని టేకుమట్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సట్ల రవి, ఆకునూరి తిరుపతి ప్రకటించారు.
నిజానికి భూపాలపల్లి నియోజకవర్గంలోని ఒక్క టేకుమట్ల మండలంలోనే బీఆర్ఎస్ నిరసన కార్య క్రమానికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నేతల డైవర్షన్ టాక్టిటిక్స్, పోలీసుల అత్యుత్సాహం బెడిసికొట్టిందని శనివారం నియోజకవర్గవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలే స్పష్టం చేశాయి.బీఆర్ఎస్ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అనుచరులు ఇసుక అక్రమ రవాణా మాజీ ఎమ్మెల్యే హయాంలోనే ఎక్కువగా సాగిందని అందుకు తామూ నిరసన చేపడతామని డైవర్షన్ టాక్టిటిస్కు తెరలేపారు.
ఈ వ్యూహమే వారిని మరింత దిగ జార్చింది. టేకుమ ట్లలో తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. టేకు మట్లలో ఎక్కడ చూసినా పోలీసులే అన్నట్టుగా సీన్ మారిపోయింది. దీంతో నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల గులాబీ శ్రేణులు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై తిరుగుబాటు చేసేలా ప్రేరేపించింది.
టేకుమట్లలో శాంతియుతంగా తాము చేపట్టిన నిరసన కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసుల ను ఉసిగొలిపి అడ్డుకునే ప్రయత్నాలు చేయడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ మెరుపు నిరసన చేపట్టింది. టేకుమట్లలో చోటుచేసుకున్న పరిణామాల పర్యవసానాలు గంట వ్యవధిలోనే నియోజకవర్గం అంతా విస్తరించింది. బీఆర్ఎస్ మెరు పు ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు షాక్కు గురయ్యారు. పోలీసులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎండగడుతున్న తమ కార్యకలాపాలకు జీర్ణించుకోలేని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆయన అనుచరులు ఇప్ప టికైనా పద్ధతి మార్చుకోవాలని బీఆర్ఎస్ హెచ్చరించింది.
జిల్లా కేంద్రంలోని జాతీయ ప్రధాన రహదారి పై సీఎం రేవంత్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుల దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి, సర్దార్ సర్వాయి పాపన్న సెంటర్లో వాటిని దహనం చేశారు. ఇలా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. మొత్తానికి భూపాల పల్లిలో బీఆర్ఎస్ను ఇరికిం చబోయి కాంగ్రెస్ తానే బోన్లో ఇరుకున్నదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతుండడం గమనార్హం.