భీమదేవరపల్లి, మే 5 : వాట్సాప్ వేదికగా ఇందిరమ్మ ఇండ్ల పథకంపై చేస్తున్న చర్చ రచ్చరచ్చవుతోంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగింది. అయితే జాబితాలో అనర్హుల పేర్లు వచ్చాయని కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్నారు. కొప్పూరు గ్రామంలో వాట్సాప్ వేదికగా ఓ యువకుడు ప్రశ్నల వర్షం సంధించాడు. ఓ వైపు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని చెబుతుంటే, కమిటీ సభ్యులు మాత్రం తమ ఇంట్లో వారి పేర్లనే జాబితాలో పెట్టుకున్నారని ఆరోపించాడు. గ్రామంలో మీరు ప్రతిపాదించిన వారి కంటే నిరుపేదలు లేరా అని నిలదీశాడు.
అదేవిధంగా గట్లనర్సింగాపూర్ గ్రామంలో ఏకంగా సొంత పార్టీ నాయకులే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జాబితాపై మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు వారి పేర్లే పెట్టుకుంటారా..? నిరుపేదలకు ఇవ్వరా అని ఆ పార్టీ నాయకులు బొల్లంపల్లి కాంతారావు, షడ్రక్, అంబాల రాజుకుమార్ వాట్సాప్ వేదికగా ప్రశ్నించారు. దీంతో మరుసటి రోజే పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూర్ణచందర్, మరికొంతమంది ప్రకటించారు.
పార్టీ సిద్ధాంతాలు, కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. తమను బహిష్కరించే హక్కు ఎవరికీ లేదని, తప్పు చేస్తే నికార్సయిన కాంగ్రెస్ నాయకులుగా నిలదీస్తామని వారు తేల్చిచెప్పారు. దాదాపు అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ లోపభూయిష్టంగా జరుగుతుందని ప్రజలు మండిపడుతున్నారు. అర్హులను పక్కన పెట్టి ఇందిరమ్మ కమిటీ సభ్యులు వారి బంధువులు, స్నేహితులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఇంతకుముందు గ్రామాల్లో రచ్చబండ వేదికగా లేక హోటళ్లు, నాలుగుబాటల సముదాయాల్లో చర్చలు జరిగేవి. ఇప్పుడు వాట్సాప్ వేదికగా ఈ చర్చలు దండిగా జరుగుతున్నాయి. అర్హులమైన తమకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని తెలిసినా.. వాట్సాప్లో జరుగుతున్న చర్చలో జోక్యం చేసుకుంటే మరుసటి రోజు తమల్ని టార్గెట్ చేస్తారని భయంతో మిన్నకుంటున్నారు. ఏదేమైనా ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ద్వారా జరుగుతున్న లబ్ధిదారుల ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులకు మధ్య తీవ్ర దూరాన్ని పెంచుతుందని చెప్పవచ్చు.