నమస్తే నెట్వర్క్ : పరకాలలో పోలింగ్ సరళిపై చర్చించుకుంటున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో నాగయ్య, రత్నాకర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఏరుకొండ శ్రీనివాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. అకారణంగా దాడి చేసిన వారిపై చర్య లు తీసుకోవాలని బాధితులు పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడంతో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవిరాజు తెలిపారు. గాయపడిన వారిని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.
వరంగల్, మహబూబాబాద్ సెగ్మెంట్లలో చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. పలుచోట్ల అధికారులు సరిచేసి పోలింగ్‌ను కొనసాగించగా మరికొన్ని కేంద్రాల్లో గరిష్ఠంగా రెండు గంటల సమయం పట్టడంతో ఓటర్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది. బయ్యారం మండలం వెంకట్రాంపురంలోని జడ్పీ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి గుర్తుపై సిరా చుక్క అంటించడంతో గంటపాటు పోలింగ్ నిలిచిపోయింది.
నెల్లికుదురు మండలం హేమ్లతండాలోని 160వ పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తూ వీడియో తీసి వాట్సాప్‌లో పోస్టు చేసిన ఇస్రతండాకు చెందిన బానోత్ బాలకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంగెం మండలం ఎల్గూరు స్టేషన్ బూత్‌లో ఓటు వేసి సెల్ఫోన్లో వాట్సాప్‌లో వైరల్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అధికారులతో యువకులు వాగ్వాదానికి దిగారు.