వరంగల్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వర్ధన్నపేట : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ చేపట్టిన జనహిత పాదయాత్ర జనరహి తంగా.. కాంగ్రెస్ మార్క్ గ్రూపు సహితంగా సాగిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య వైరం మీనాక్షి నటరాజన్ సాక్షిగా మరోసారి బట్టబయలైంది. ఇతర జిల్లాలో మీనాక్షి నటరాజన్ యాత్రలో ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పోటాపోటీగా హాజరయ్యారు.
కానీ, వరంగల్‌లో మాత్రం అందుకు భిన్నంగా ‘మేం వేరు..మా గ్రూపులు వేరు’ అన్నట్టుగా తేలిపోయిందని ఆ పార్టీ శ్రేణులే గుస గుసలాడుతున్నాయి. సోమవారం మధ్నాహం అనుకున్న కార్యక్రమం రాత్రి 7 గంటలకు మొదలై.. దాదాపు మూడున్నర కిలోమీటర్లు నడిచి మొత్తం కార్యక్రమం పూర్తయ్యేసరికే రాత్రి 9.30 కల్లా పూర్తి అయింది. తన నియోజకవర్గ సరిహద్దులో (హంటర్‌రోడ్‌లోని ఖమ్మం ఫ్లైఓవర్ దగ్గర మీనాక్షి నటరాజ న్, మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కొండా దంపతులు మాత్రమే స్వాగతం పలికారు. వారి వైరివర్గం దూరంగా ఉన్నారు. మంత్రి సీతక్క, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి తదితరులు పాదయాత్రకు దూరంగా ఉండిపోయారు.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సాక్షిగా ఆ పార్టీ కార్యకర్తలు రైతుపై దాడికి పాల్పడ్డారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద సెంటర్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి మాట్లాడుతున్న సమయంలో వాహనం ముందు ఓ యువ గిరిజన రైతు ‘యూరియా దొరుకుతలేదు..యాడికి పోవా లె?’ అని అడుగుతుండగానే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అతడిని పిడిగుద్దులు గుద్దుతూ లాక్కె ళ్లిపోయారు. ఒక దశలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వాహనంపై నుంచి ఆగండి.. ఆగండి అంటూ సైగ చేశారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు యూరియా టెన్షన్ నెలకొన్నది.
అధికార కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజాహిత కార్యక్రమానికి జనాదరణ కరువైంది. సోమవారం ఇల్లంద గ్రామం నుంచి వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్ వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజా హిత పాదయాత్ర చేపట్టింది. అనంతరం అంబేద్కర్ సెంటర్లో కార్నర్ మీటింగ్‌కు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలను తరలించేందుకు పార్టీ నేతలు ప్రయత్నించారు. కానీ సభకు జనాలు రాకపోవడంతో కార్నర్ మీటింగ్ పేలవంగా జరిగింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మీనాక్షీ నటరా జ్ను కలిసేందుకు కార్యకర్తలు పోటీ పడడంతో పలు చోట్ల తోపులాట జరిగింది.