కృష్ణకాలనీ, సెప్టెంబర్ 17: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్ర భుత్వాన్ని రైతులు ఛీ కొడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ పటేల్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన గండ్ర జాతీయ జెండాను ఎగురవేసి, పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ చెర నుంచి భారతదేశం విముక్తి పొందిన 13 నెలల తర్వాత తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు.
ఈ క్రమంలో ఆంధ్రపాలకుల చేతిలో బంధీ అయిన తెలంగాణ ప్రాంతానికి విముక్తి కల్పించే లక్ష్యంతో కేసీఆర్ నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో ఉద్యమం చేసేందుకు ప్రజలు సంసిద్ధం కావాల్సిన అవసరం ఉందని గండ్ర పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాం లో గొప్పగా నిర్మాణమైన రాష్ట్రాన్ని వంచిస్తున్న కాంగ్రెస్ పాలకులపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి యత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నప్పటికీ, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన చరిత్ర లేదన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తాకడం ఖాయమన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేలొని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి హక్కులు సాధించుకోవాలని గండ్ర పిలపునిచ్చారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌కుమార్ యాదవ్, భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, మాజీ ఫ్లోర్ లీడర్ నూనె రాజు పటేల్, మాజీ కౌన్సిలర్లు బద్ది సమ్మయ్య, పూలమ్మ, మంగళపల్లి తిరుపతి, ముంజంపల్లి మురళీధర్, నాయకులు బీబీ చారి, బండారి రవి, మామిడి కుమార్, చిన్నాల ప్రవీణ్, కరీం, గడ్డం కుమార్‌రెడ్డి, పిల్లి వేణు, స్వప్న, భాగ్యలక్ష్మి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.