‘వెయ్యేండ్ల సాంస్కృతికి వైభవమైన కాకతీయ కీర్తి తోరణం, చార్మినార్‌ను తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి తొలగించి చరిత్రను చెరిపేసే కుట్ర జరుగుతున్నది. వీటిని తీసివేయడం ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉంది. ఇందులో తేడా వస్తే ప్రజలు ఊరుకోరు. మార్పులు, చేర్పులు ఆమోదయోగ్యంగా ఉండాలి. రాజముద్రలో ఇంకా ఏమైనా అదనంగా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ , ఉన్నవాటిని తీసేయడం సరి కాదు. అదేవిధంగా కళాకారులు, కవులు, మేధావులు, సంగీత కళాకారులకు రాష్ట్రంలో కొదువ లేదు. వీరందరినీ సంప్రదించకుండా పాట మారుస్తామనడం పిల్లల ఆటలా ఉంది.
దీన్ని తీవ్రంగా ఖండించాలి’ అని గురువారం హనుమకొండలోని కాకతీయ హరిత హోటల్లో టార్చ్(టీం ఆఫ్ రిసెర్చ్ కల్చర్ అండ్ హెరిటేజ్) ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మేధావులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన సంస్కృతి, చరిత్రకు ప్రాధాన్యమిచ్చి రూపొందించిన ఈ చిహ్నాన్ని మార్చాలనుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. అధికారంలో ఉన్నామని మార్చుకుంటూ పోతే తెలంగా ణ చరిత్రకే మాయనిమచ్చగా మిగులుతుందని పేర్కొన్నారు.
– హనుమకొండ చౌరస్తా, మే 30
కాకతీయ తోరణానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్ అంటే చార్మినార్. దానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. వరంగల్ అంటేనే కాకతీయుల తోరణం. వాటిని రాజముద్ర నుంచి తొలగిస్తామనడం సరైంది కాదు. తెలంగాణలోని మేధావులు మేధోమథనం చేయాల్సిన అవసరం ఉంది.
– ప్రేరణి అశోక్
సంస్కృతికి చిహ్నం కాకతీయుల కళాతోరణం. దాన్ని రాజముద్ర నుంచి తీస్తేసే భవిష్యత్‌లో చరిత్ర మరిచిపోతారు. వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. నెపోలియన్, హిట్లర్, లెనిన్ వివేకవంతమైన పాలకులకు హిస్టరీ తెలియదు. చరిత్ర తెలిస్తేనే గతాన్ని మనం మార్చలేం. చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని మంచిగా నిర్మించుకునేలా కాకతీయులు సేవలందించారు. కాకతీయ రాజులు చెరువులు, గుళ్లు, వారి నగరాలను సర్వకళలతో రూపొందించారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చేలా నిర్మించారు. సంస్కృతికి చిహ్నమైన కళాతోరణం రాజముద్రలో తప్పనిసరిగా ఉండాలి. వెయ్యి పేజీల వారసత్వ సంపద అనుకోవాలి. కళా తోరణాన్ని తొలగించడాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించాలి.
– విజయబాబు, కేయూ హిస్టరీ ప్రొఫెసర్
ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కాలానికి ఎదురునిలబడింది కాకతీయ తోరణం. 900 సంవత్సరాల క్రితం గణపతి దేవుడు రెండు, రాణీరుద్రమ దేవి రెండు తోరణాలు ప్రారంభించగా, ఆ తర్వాత ఖిలా వరంగల్ ఉండే స్వయంభూ దేవాలయాల్లో నాలుగు దిక్కులుగా నాలుగు మిడ్ పాయింట్లలో ఏర్పాటు చేశారు. హనుమకొండ కోట ప్రవేశద్వారం అగ్గిలయ్య, సిద్ధమయ్యగుట్ట, కొలనుపాక, ఐనవోలు ఎంట్రెన్స్ వద్ద ఏర్పాటు చేశారు. 1970కి ముందు ఢిల్లీ సుల్తాన్లు అన్ని దేవాలయాలను ధ్వంసం చేసినా కాకతీయ తోరణాలను మాత్రం వదిలేశారు.
ప్రపంచవ్యాప్తంగా కాకతీయ తోరణానికి గుర్తింపు ఉంది. 1945లో పోస్టల్ స్టాంప్‌పై ముద్రించారు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభను ఈ లోగోతో నిర్వహించారు. 297 సంవత్సరాలు పాలించిన కాకతీయులు ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదు. కానీ ప్రజల సౌకర్యం కోసం చెరువులు కట్టించారు. కాకతీయుల ఖ్యాతికి భంగం కల్గించవద్దు. సూర్యుడు, చంద్రుడు ఎన్నేళ్లు ఉంటారో తెలంగాణలో ఉండే ప్రతి ఖ్యాతి అంతే. తుగ్లక్ ఏడుసార్లు వరంగల్‌పై దాడి చేసినా కాకతీయుల తోరణాలను ముట్టుకోకుండా వదిలేశాడు.
– అరవింద్ ఆర్య, టార్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
సాహితీసంపదను కాపాడుకోవాలి. కాకతీయుల తోరణాన్ని రాజముద్ర నుంచి తొలగిస్తామంటే తీవ్ర మైన బాధేస్తోంది. ఎందుకు తొలగిస్తున్నారు?, ఇగో కావచ్చు, వరంగల్ అంటేనే కాకతీయ కళాతోరణం. రాష్ట్రం పరువు తీస్తున్నారు. కళాకారులు, కవులు, మేధావులు, సంగీత కళాకారులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. చరిత్రకారులను సంప్రంచకుండా పాట మారుస్తామనడం సరికాదు. పిల్లల ఆటలా ఉంది. మేధావులు, కవులు, కళాకారులు దీన్ని తీవ్రంగా ఖండించాలి. రాజముద్ర నుంచి కాకతీయ తోరణం తీసేయకుండా చూడాలి.