వరంగల్, నవంబర్ 3 : కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వరంగల్ మహానగరానికి శాపంగా మారింది. భద్రకాళీ చెరువు సుందరీకరణ, పర్యాటకులకు కొత్తహంగులంటూ ఊదరగొట్టి చారిత్రక నగరంలో, ప్రజల జీవితాల్లో వరద విధ్వంస చరిత్రను రేవంత్ సర్కార్ లిఖించింది. మొంథా తుపాను హెచ్చరికలను పెడచెవిన పెట్టడం, నిర్దేశిత కాలంలో పనులు పూర్తిచేయకపోవడం వంటి కారణాలతో మునుపెన్నడూలేని ఘోర విపత్తును వరంగల్ ఎదుర్కొన్నది. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలను సర్కారు లైట్‌గా తీసుకున్నది. ముందస్తు కార్యాచరణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కుండపోతగా వర్షం కురుస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి కూర్చున్నది. ఫలితంగా దశాబ్ధాలుగా ముంపును ఎరుగని అనేక కాలనీలు వరదలో విలవిలలాడగా.. సర్కారు నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వమే కారణమంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
భద్రకాళీ చెరువు సుందరీకరణ, పర్యాటకులకు కొత్త హంగులతో కనువిందు వంటి అందమైన పేర్లతో చెరువును కాంగ్రెస్ సర్కారే చెరబట్టింది. గతంలో భద్రకాళీ బండ్ నిర్మాణాన్ని చెరువు చుట్టూ చేసుకుంటూ పోతే ఈసారి ప్రభుత్వం ఏకంగా చెరువు గర్భాన్నే కబ్జా చేసింది. చెరువు మధ్యలో నవద్వీపాల పేరుతో 50 నుంచి 60 ఎకరాల మేర మట్టిగుట్టలు పోసింది. భద్రకాళీ చెరువు పూడికతీత పేరుతో చెరువును గత ఏడాది నవంబర్ 8న కాంగ్రెస్ సర్కార్ ఖాళీ చేసింది.
కాకతీయుల కాలంనాటి మత్తడి కట్టను తెంపి.. యుద్ధ ప్రాతిపదికన మత్తడి గేట్ల నిర్మాణం పూర్తి చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు. ఆరు నెలల్లో మత్తడిగేట్లు నిర్మించి, చెరువులో నీటిని నింపుతామన్న హామీ ఇచ్చినప్పటికీ ఏడాదిగా పనులు సాగుతూనే ఉన్నాయి. దీంతో భారీ వర్షంతో చెరువులోకి వచ్చిన నీరు వచ్చినట్టే బయటకు వెళ్లడంతో హనుమకొండ పట్టణంలోని అలంకార్ నాలా మీదుగా పెద్దమ్మగడ్డ, కాకతీయకాలనీ ఫేజ్ -1, 2 నీటమునగడమే కాకుండా అలంకార్ జంక్షన్-ములుగురోడ్ మధ్యలో మునుపెన్నడూ లేని వరద ప్రవాహంతో రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు ఎంత భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చినా ముంపుబారిన పడని అనేక కాలనీలు ఈసారి జలమయమయ్యాయి. హన్మకొండ చౌరస్తా, రాయపురా, కుమార్‌పల్లికి సైతం భద్రకాళీ నీళ్లు ఎగతన్నాయి.
పోతననగర్ బైపాస్ రోడ్డు నాలా విస్తరణ పనులను అసంపూర్తిగా వదిలేయడంతో వరద నీరు అనేక కాలనీలను ముంచెత్తింది. వరంగల్ 12 మోరీల నుంచి పోతన రోడ్డు మీదుగా భద్రకాళీ నాలాకు కలపాల్సిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో పోతననగర్తోపాటు బైపాస్‌రోడ్డు, రఘునాథకాలనీ తీవ్ర ముంపును ఎదుర్కొన్నాయి. ఈ ప్రభావంతో ఎన్నడూ ముంపునకు గురికాని రామన్నపేట సైతం నీట మునిగింది. అయితే, ఇటీవల ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డికి తమ సమస్యలు చెప్పుకుందామని భావించిన పోతననగర్, రంగంపేట వాసులకు నిరాశే ఎదురైంది.
గోపాల్పూర్ చెరువు కట్ట తెగిపోవడం వెనక అధికారుల నిర్లక్ష్యం ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ వర్షాలతో గోపాల్పూర్ చెరువు మత్తడి పడిన విషయం తెలిసినా అధికారులు డక్ట్ గేట్లు ఎత్తడంలో నిర్లక్ష్యంగా వ్యవరించారు. దీంతో చెరువు కట్ట తెగడంతో సమ్మయ్యనగర్తోపాటు జవహర్‌కాలనీ, ద్వారకాసాయి కాలనీ, సదాశివ కాలనీ, మారుతి కాలనీ, వీటితో పాటు అనేక కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఈ పాపానికి కారణం ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కారేనని ముంపు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుస్తు ఆలోచనలతో గోపాల్పూర్ చెరువు డక్ట్ గేట్ ఎత్తేస్తే ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదని మండిపడుతున్నారు.