నర్సంపేట, జూన్ 29 : దేశానికి అన్నం పెట్టే రైతులకూ ఒక వేదిక ఉండాలని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆ మేరకు అన్నదాతలు తమ అవసరాలు తీర్చుకునేలా, సాగులో మెళకువలు తెలుసుకునేలా, వ్యవసాయాభివృద్ధిలో రాణించేందుకు సలహాలు, సూచనలు పంచుకోవడానికి క్లస్టర్ల వారీగా రైతు వేదికలు నిర్మించారు. ఒక్కో వేదిక కోసం రూ. 22 లక్షల చొప్పున కోట్లాది రూపాయలు వెచ్చించి వరంగల్ జిల్లాలో నర్సంపేట మండలంలో 5, ఖానాపురంలో 4, దుగ్గొండిలో 4, చెన్నారావుపేటలో 4, నెక్కొండలో 7, నల్లబెల్లిలో 5, వర్ధన్నపేటలో 6, సంగెంలో 5, గీసుగొండలో 5, పర్వతగిరిలో 6, రాయపర్తిలో 5, వరంగల్‌లో 1, ఖిలావరంగల్ మండలంలో 2 చొప్పున మొత్తం 59 రైతు వేదికలు నిర్మించారు.
అందులో పెద్ద సమావేశపు హాలు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ప్రత్యేక గది, అధికారులు, రైతుల కోసం కుర్చీలు, బల్లలు, మైక్‌సెట్‌తో పాటు టీవీ, నెట్ కనెక్షన్ ఏర్పాటు చేసి వీడియో కాన్ఫరెన్స్‌కు అవకాశం కల్పించారు. అంతే కాకుండా ప్రతినెలా వాటి నిర్వహణకు రూ. 9 వేలు సైతం అందించారు. రైతు వేదికల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు సలహాలు, సూచనలు అందించేవారు. అంతేగాక ప్రతి క్లస్టర్‌కు ఒక వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)ని నియమించడంతో పాటు వారు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది.
వ్యవసాయ క్లస్టర్ పరిధిలోని రైతు వేదికల నిర్వహణకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా నయా పైసా ఇవ్వడం లేదు. దీంతో సంబంధిత ఏఈవోలు తమ జేబుల్లోంచి డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. నిర్వహణ ఖర్చులు రోజు రోజుకు పెరిగి అదనపు భారం మీదపడడంతో ఏఈవోలు తలలు పట్టుకుంటున్నారు.
‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వీపర్‌కు రూ. 3 వేలు, సమావేశాలు, శిక్షణల కోసం రూ. 2,500, స్టేషనరీ, జిరాక్స్‌కు రూ.1,000, తాగునీటి కోసం రూ. 500, చిన్న చిన్న మరమ్మతులు, ఇతర ఖర్చులకు మరో రూ.1,000, కరెంటు బిల్లుకు రూ. 1000 కలిపి మొత్తం నెలకు రూ. 9 వేలు అందించింది. కాంగ్రెస్ సర్కారు ఈ నిధులు విడుదల చేయకపోవడంతో ఏడాదిన్నరగా నిర్వహణ, పర్యవేక్షణ ప్రశ్నార్ధకంగా మారింది. సంబంధిత వ్యవసాయ అధికారులపై ఆర్ధిక భారం పడింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వేదికల్లోనే రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ నిధులివ్వకపోవడంతో అధికారులకు కష్టంగా మారింది.
రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఏఈవోలే తమ జేబుల్లోంచి డబ్బులు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వానికి ప్రతినెలా నిర్వహణ బిల్లులు పంపించాం. అవి ఇంకా మంజూరు కాలేదు. బిల్లులు వస్తే ఏఈవోలపై ఆర్థిక భారం పడకుండా ఉంటుంది.
– కృష్ణకుమార్, ఏవో, నర్సంపేట
రైతు వేదికల నిర్వహణ నిధులు ఇంకా మంజూరు కాలేదు. ప్రభుత్వం వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. క్లస్టర్ పరిధిలోని ఏఈవోలు తమ జీతం నుంచి నిర్వహణ ఖర్చులు పెడుతున్నారు. బిల్లులు వెంట వెంటనే అందిస్తే రైతు వేదికల నిర్వహణ సాఫీగా సాగిపోతుంది.
– కేతిడి దామోదర్‌రెడ్డి, ఏడీఏ, నర్సంపేట