ములుగు, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ములుగు జిల్లాను రద్దు చేస్తుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో పూటకో కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకు బలం చేకూర్చేలా అధికార పార్టీ నేతలు, మంత్రి సీతక దీనిని ఖండించకపోవడంతో ప్రజల్లో అనుమానాలు తీవ్రమవుతున్నాయి. రూ.60 కోట్లతో గత ప్రభుత్వ హయాంలో సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు ప్రారంభించగా, ప్రస్తుతం పూర్తయినా అధికారికంగా ప్రారంభోత్సవానికి అధికారులతో పాటు ప్రభుత్వం ఆలోచిస్తుండడం నిజంగానే జిల్లా రద్దు అవుతుందా అనే సందేహాలు వ్యకమవుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ ప్రభుత్వం వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ములుగు ప్రాంతాన్ని 2016లో జరిగిన జిల్లాల పునర్విభజనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విలీనం చేశారు.
అప్పుడు మంత్రిగా పనిచేసిన అజ్మీరా చందూలాల్, ప్రతిపక్ష నేతగా ఉన్న సీతక, ప్రజా సంఘాల నాయకులు అన్ని వర్గాల ప్రజలు ములుగు ప్రాంతం ప్రత్యేక జిల్లా సాధన కోసం అనేక పోరాటాలు చేశారు. ములుగు ప్రాంత ప్రజల ఆకాంక్షను తెలుసుకొని నాటి సీఎం కేసీఆర్ 33వ జిల్లాగా ములుగును ఏర్పాటు చేస్తున్నట్లు 2018 నవంబర్ 30న ములుగులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు. 2019లో రెండో సారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఫిబ్రవరి 17న కేసీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా 9 మండలాలతో ములుగును నూతన జిల్లాగా ఏర్పాటు చేశారు.
2019 లో రాష్ట్రంలో చివరి జిల్లాగా ఏర్పాటైన ములుగు ఏడేళ్లుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వస్తున్నది. 2023 జూన్‌లో సమీకృత కలెక్టరేట్ పనులను ప్రారంభించగా ప్రస్తుతం పనులు పూర్తి స్థాయి చేరుకున్నాయి. కేసీఆర్ అభివృద్ధి జాడలను చెరిపేలా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన అంశాన్ని లేవనెత్తి తిరిగి ములుగు ప్రాంతాన్ని భూపాలపల్లి జిల్లాలో కలుపుతున్నారంటూ ఊహాగానాలు రావడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
దానిని నిజం చేసేలా పనులు పూర్తయిన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించేందుకు అధికారులు, అధికార పార్టీ నాయకులు ఎందుకు వెనుకడుతున్నారో అర్థం కాని పరిస్థితి. మేడారం పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి కానీ, సంబంధిత మంత్రులు గాని ప్రారంభిస్తేనే జిల్లా మనగడలో ఉంటుందని, లేదంటే అంతే సంగతులని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్థానిక మంత్రి సీతక ప్రత్యేక తీసుకొని సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించి అన్ని శాఖల కార్యాలయాలను నూతన కలెక్టరేట్‌లోకి మార్పించి జిల్లా రద్దు అనే అంశంపై వెలువడుతున్న అనుమానాలను నివృత్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.