మహబూబాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : మిషన్ భగీరథ పథకంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినా, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మళ్లీ పాత రోజులు పునరావృతమవుతున్నాయి. ఎండాకాలం కావడంతో తాగునీటి కోసం పల్లెలు, పట్టణాలు గోస పడుతున్నాయి. తాగునీళ్ల కోసం బిందెలతో మహిళలు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది.
గత పదేళ్లలో ఎన్నడూ రాని తాగునీటి గోస మళ్లీ మొదలైంది. రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎండాకాలం వచ్చిందంటే మహిళలు తాగునీళ్ల కోసం బిందెలతో రోడ్డెక్కాల్సి వచ్చేది. కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి తెచ్చుకునేవారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి శుద్ధి చేసిన జలాలను ఎండాకాలంలో కూడా ప్రతిరోజూ అందించింది. దీంతో గత పదేళ్లలో తాగునీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కలేదు.
కానీ, కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే మళ్లీ నాటి రోజులు పునరావృతమవుతున్నాయి. మిషన్ భగీరథ పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తాగునీటి కోసం పల్లెలు, పట్టణాలు తండ్లాడుతున్నా యి. గత ప్రభుత్వ హయాంలో భగీరథ నీళ్లు ప్రతి రోజూ వచ్చేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట రోజు తప్పించి రోజు, తర్వాత రెండు రోజులకోసారి, ఇప్పుడు నాలుగు రోజులకోసారి నీళ్లు ఇస్తున్నారు.
కొన్ని గ్రామాలు, తండాల్లో నీళ్లు అసలే రావడం లేదు. ప్రైవేటు వాటర్ప్లాంట్లలో క్యాను రూ.10ల వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మహబూబాబాద్ పట్టణంలో నందనాగర్, జగ్జీవన్‌రావు కాలనీ, హౌసింగ్ బోర్డ్, హనుమంతునిగడ్డ, లెనిన్‌నగర్, సిగ్నల్ కాలనీ, ఇందిరానగర్ కాలనీ, గాంధీపురం, ముత్యాలమ్మగూడెం కాలనీలో తాగునీరు రాక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. గూడూరు మండలం గుండెంగ సమీపంలోని నాలుగైదు తండాలకు వారం రోజులుగా తాగునీరు రావడం లేదు. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో నాలుగు రోజులకోసారి మిషన్ భగీరథ నీరు వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు.
దంతాలపల్లి మండలం బాల్యతండా శివారు సింగితండాకు ఇప్పటివరకు భగీరథ నీరు రాకపోవడంతో అకడి ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. మహబూబాబాద్ పట్టణంలో మిషన్ భగీరథ నీళ్లు రెండు మూడు రోజులకోకసారి వస్తుండడంతో మున్నేరు వాగు నుంచి నీటిని డంపు చేసి ఫిల్టర్ చేసి పట్టణ ప్రజలకు అందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగునీటి వసతి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
వెంకటాపురం(నూగూరు) : తాగునీటి కోసం గిరిజన గ్రామాల ప్రజలు తండ్లాడుతున్నారు. చెలిమె నీరే వీరికి దిక్కైంది. ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండల పరిధిలోని బర్లగూడెం పంచాయతీ పర్షికగూడెం, రామవరం గ్రామాల ప్రజలు చెలిమ నీటినే తాగునీరుగా వాడుకుంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు, బావులు వట్టిపోయాయని, మిషన్ భగిరథ నీరు కూడా అరకొరగా రావడంతో ప్రజలు తాగునీళ్ల కోసం ఇబ్బందిపడుతున్నారు. చేసేదేమీ లేక గ్రామ శివారులోని చెరువు వద్ద చెలిమ తీసుకొని ఆ నీటినే తాగునీరుగా వాడుకుంటున్నారు. చెలిమ నీరు తెచ్చుకునేందుకు ఉదయం నుంచే పడిగాపులుకాయాల్సి వస్తున్నదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.