సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్‌రోడ్డు పరిసరాలలోని మున్సిపాలిటీలను గ్రేటర్లో కలపడం, ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు ముక్కలుగా విడగొట్టడంలో రాజకీయ కుట్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఔటర్ పరిసరాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి పట్టుంది. బీఆర్ఎస్కు ఉన్న పట్టును చూసిన కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలు, గ్రేటర్ హైదరాబాద్ యదావిధిగా ఉంటే తమ భవిష్యత్తు కష్టమని భావించి, విలీనం, విభజనలతో హైదరాబాద్‌ను అస్తవ్యస్తం చేసి తమ సొంత ప్రయోజనాల కోసం కుటిల యత్నాలు చేస్తున్నదని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇటీవల మున్సిపల్ ఎన్నికలలో ఔటర్ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ తమ సత్తాను చాటింది. అదే ఔటర్ పరిసరాలలో ఉన్న 27 పురపాలికలను గ్రేటర్లో విలీనం చేశారు. అదే విలీనం కాకుండా ఇటీవల అక్కడ ఎన్నికలు జరిగి ఉంటే, అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీనే ఘన విజయం సాధించేదని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం, మేడ్చల్, పటాన్చెరు నియోజకవర్గాల్లో మిగిలిన మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. ఈ పరిస్థితి ముందే గుర్తించిన కాంగ్రెస్ పార్టీ నగరం పరిసరాలలో ఉన్న పురపాలికలను గ్రేటర్లో విలీనం చేసిందని, ఇదంతా మున్సిపల్ ఎన్నికలలో ఓటమి ఖాయమని గుర్తించి చేసిన కుట్రేనని సిటీజనులుమాట్లాడుకుంటున్నారు.
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి వైపే…!
గ్రేటర్ హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లోని ఇటీవల ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. నగర శివార్లలోని ప్రాంతాలన్నీ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని ఈ ఎన్నికలు మరోసారి నిరూపించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోని ప్రజలంతా కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ అరాచక పాలన సాగిస్తోందని, దీంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయయని, అభివృద్ది పూర్తిగా కుంటుపడిందని, విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారడం, ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకోవడం, వ్యవస్తీకృత నేరాలు పెరగడంతో ప్రజలు ఆందోళనతో ఉన్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేసిన అభివృద్ధికి గీటురాయిలాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ప్రజలు తమ వాణి వినిపించారు. అదే విలీనం కాకుండా ఉంటే మిగతా మున్సిపాలిటీలన్నీ బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆయా మున్సిపాలిటీలను విలీనం చేసి, ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేశారు. అయితే మూడు ముక్కలు చేసి పక్కా ప్లాన్‌తో బీజేపీ, ఎంఐఎం పార్టీల సహకారంతో మత రాజకీయాలు చేసి వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే కుట్రలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. .
అన్ని వైపుల నుంచి వ్యతిరేకత.!
హైదరాబాద్‌ను ఇష్టానుసారంగా మూడు ముక్కలు చేయడంపై ప్రతి పక్ష పార్టీలు వ్యతిరేకించాయి. దీంతో పాటు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన శివారు ప్రాంతాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు గ్రేటర్ శివారు ప్రాంతాలలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ విభజన విషయంలో ఆగ్రహాంతో ఉన్నట్లు సమాచారం. విలీనం, విభజనపై ఇప్పటికే హైదరాబాద్ పౌరులు కోర్టు మెట్లెక్కారు. మున్సిపల్, పోలీసు విభాగాలను మూడుగా విభజించడంలో ఎక్కడ కూడా క్షేత్ర స్థాయి పరిశీలనలు చేయలేదు, అనుభవం ఉన్న అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరించకుండానే కొందరు ప్రభుత్వ పెద్దలు హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేశారంటూ అన్ని వర్గాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో మత రాజకీయాలను సృష్టించి గ్రేటర్ ఎన్నికలలో లబ్ది పొందేందుకు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలు ఎవరికి వారే తమ ఫ్లాన్లు సిద్దం చేసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇదిలాఉండగా జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో గ్రేటర్ విభజనపై తాడోపేడో తేల్చుకోవాలనే ధోరణితో ప్రతిపక్ష పార్టీలే కాకుండా అదికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిదులు సైతం తమ సన్నిహితుల వద్ద చర్చిస్తున్నట్లు సమాచారం.