అహ్మదాబాద్ : ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుస విజయాలకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేసింది. సూపర్-8లో భాగంగా ఆదివారం జరిగిన తమ తొలి పోరులో టీమ్ఇండియా 76 పరుగుల తేడాతో సఫారీల చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. గ్రూపు దశలో అపజయమెరుగని సూర్యకుమార్‌యాదవ్ నేతృత్వంలోని టీమ్ఇండియా.. కీలకమైన సూపర్-8లో తేలిపోయింది. దీంతో పొట్టి ఫార్మాట్లో వరుసగా 12 విజయాలకు ఫుల్స్టాప్ పడగా, గత ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి దక్షిణాఫ్రికా దీటైన ప్రతీకారం తీర్చుకుంది. సఫారీలు నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 18.5 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. యాన్సెన్(4/22), కేశవ్ మహారాజ్(3/24), కార్బన్ బాశ్(2/12) విజృంభణతో టీమ్ఇండియా బ్యాటింగ్ కుదేలైంది. దూబే(42) ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోంది. హ్యాట్రిక్ డక్‌లతో పేలవ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అభిషేక్‌శర్మ(15) ఎట్టకేలకు మెగాటోర్నీలో పరుగుల ఖాతా తెరువగా, ఈసారి ఇషాన్ కిషన్(0) తన వంతు అంటూ సున్నా చుట్టాడు. తిలక్‌వర్మ(1) మరోమారు విఫలం కాగా, మిడిలార్డర్లో సూర్యకుమార్(18), సుందర్(11), హార్దిక్(18), రింకూ(0) ఘోరంగా విఫలమయ్యారు. పిచ్ పరిస్థితులకు తగ్గట్లు సఫారీ బౌలర్లు స్లో బాల్స్‌తో టీమ్ఇండియా వికెట్ల వేట కొనసాగించారు. ముఖ్యంగా యాన్సెన్, ఎంగ్డీ భారత బ్యాటర్లకు కళ్లెం వేయగా, మహారాజ్ ఒకే ఒవర్లో మూడు వికెట్ల తీసి భారత గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. అంతకుముందు మిల్లర్(35 బంతుల్లో 63, 7ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు బ్రెవిస్(45), స్టబ్స్(44) రాణించడంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 187/7 స్కోరు చేసింది. బుమ్రా(3/15), అర్ష్‌దీప్(2/28) ఆకట్టుకున్నారు. మిల్లర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
బుమ్రా ధమాకా : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాను టీమ్ఇండియా స్పీడ్‌స్టర్ బుమ్రా బెంబేలెత్తించాడు. ఓ ఫోర్‌తో దూకుడు మీదే కనిపించిన సఫారీ ఓపెనర్ క్వింటన్ డికాక్(6) బుమ్రా రెండో ఓవర్లో క్రాస్ బ్యాట్ షాట్ ఆడబోయి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత తన వంతు అంటూ అర్ష్‌దీప్‌సింగ్ చేరిపోయాడు. మరుసటి ఓవర్లోనే కెప్టెన్ మార్క్మ్(్ర4)ను ఊరించే బంతితో బోల్తా కొట్టించాడు. మిడాఫ్‌లో షాట్ కోసం ప్రయత్నించిన మార్క్మ్ హార్దిక్ పాండ్యా చేతికి లడ్డులా చిక్కాడు. క్రీజులోకి వచ్చి రావడంతోనే భారీ సిక్స్‌తో ఊపుమీద కనిపించిన రికల్టన్(7) ఉసూరుమనిపించాడు. బుమ్రా స్లో బంతిని ఆడబోయిన రికల్టన్..దూబే క్యాచ్ ఇచ్చి వెనుదిరుగడంతో దక్షిణాఫ్రికా నాలుగు ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 20 పరుగులకు పరిమితమైంది. టాపార్డర్ ఘోరంగా విఫలం కాగా, ఇన్నింగ్స్‌ను సీనియర్ బ్యాటర్ మిల్లర్, బ్రెవిస్ చక్కదిద్దారు. బౌలింగ్ మార్పుగా వచ్చిన వరుణ్‌తో పాటు అర్ష్‌దీప్‌ను లక్ష్యంగా చేసుకుంటూ మిల్లర్ వరుస బౌండరీలతో జోరు కనబరిచాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి దక్షిణాఫ్రికా 41 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.
మిల్లర్, బ్రెవిస్ రాణించగా : సహచరులు విఫలమైన చోట మిల్లర్, బ్రెవిస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. మిల్లర్ మంచి పరిణతి కనబర్చగా, బ్రెవిస్ దూకుడు మీద కనిపించాడు. మరోమారు బౌలింగ్‌కు వచ్చిన వరుణ్‌ను ఈసారి మిల్లర్, బ్రెవిస్ గట్టిగా అరుసుకున్నారు. మిల్లర్ సిక్స్ కొడితే తానేం తక్కువ కాదన్నట్లు బ్రెవిస్ ఓ ఫోర్, సిక్స్ కొట్టడంతో 9వ ఓవర్లో 17 పరుగులు వచ్చి చేరాయి. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ సూర్యఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. పసలేని దూబే బౌలింగ్‌లో బ్రెవిస్ కండ్లు చెదిరే రీతిలో ఫోర్, సిక్స్ కొట్టడంతో దక్షిణాఫ్రికా 100 పరుగుల మార్క్ అందుకుంది. వీరిద్దరు రన్‌రేట్ 9కి ఏమాత్రం తగ్గకుండా పరుగులు కొల్లగొట్టారు. దూబే 13వ ఓవర్లో అప్పటికే సిక్స్ కొట్టిన బ్రెవిస్ మరో షాట్ ఆడే క్రమంలో డీప్ మిడ్వికెట్లో అభిషేక్ చేతికి చిక్కడంతో నాలుగో వికెట్‌కు 97 పరుగుల విలువైన భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఈ క్రమంలో సిక్స్‌తో అర్ధసెంచరీ మార్క్ అందుకున్న మిల్లర్‌కు స్టబ్స్ చక్కని సహకారం అందించాడు. వరుణ్ 16వ ఓవర్లో షాట్ ఆడే ప్రయత్నంలో మిల్లర్ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత యాన్సెన్(2),బాశ్(5) వెంటవెంటనే ఔటైనా..స్టబ్స్ ఆఖర్లో సిక్స్‌లతో సఫారీలు భారీ స్కోరు అందుకున్నారు.
1 ఐసీసీ మెగాటోర్నీల్లో గత 18 మ్యాచ్‌ల్లో భారత్‌కు ఇది తొలి ఓటమి. చివరిసారి అహ్మదాబాద్‌లో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడింది.
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 187/7(మిల్లర్ 63, బ్రెవిస్ 45, బుమ్రా 3/15, అర్ష్‌దీప్ 2/28),
భారత్: 18.5 ఓవర్లలో 111 ఆలౌట్ (దూబే 42, పాండ్యా 18, యాన్సెన్ 4/22, మహారాజ్ 3/24)