వరంగల్, నవంబర్ 2 : వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు సర్కారు సాయం అందని ద్రాక్షగానే మిగిలింది. సీఎం రేవంత్ రెడ్డి ఆర్భాటంగా చేసిన పర్యటన ఉత్తుత్తిగా మారింది. వరదలు వచ్చి ఐదు రోజులైనా ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు సహాయంపై అధికారులు అంచనాలు రూపొందించకపోవడం గమనార్హం. మొంథా తుపాను ప్రభావంతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు వంద కాలనీలు ముంపునకు గురయ్యాయి. వేల కుటుంబాలు వరదల్లో చిక్కుకొని సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి. కట్టుబట్టలతో మిగిలి ఆకలితో అలమటిస్తున్నాయి. సీఎం ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు రూ.15 వేలు, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పుతున్న పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఆరు గ్యారెంటీల మాదిరిగానే ఉన్నాయని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో వరద బీభత్సం సృష్టిం చి ఐదు రోజులవుతున్నా ఇప్పటి వరకు ఏలాంటి నష్ట అంచనాలు తయారు చేయలేదు. ఎన్ని ఇళ్లు నేలమట్టం అయ్యాయి?. పాక్షికంగా ధ్వంసమైనవి ఎన్ని? నీటిలో మునిగినవెన్ని?, ఎన్ని కుటుంబాలు నష్టపోయాయి?. ఏ మేరకు నష్టం జరిగిందన్న సమాచారం క్షేత్రస్థాయిలో సేకరించి నివేదిక అందించాలని సీఎం రేవంత్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించినా ఇప్పటి వరకు నష్ట అంచనాలు రూపొందించలేదు. ఆదివారం నుంచి కొన్ని మాత్రమే సర్వేలు మొదలు పెట్టారు. రెవెన్యూ, బల్దియా అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో సగానికి పైగా ముంపు కాలనీల్లో ఇంకా సర్వే ప్రారంభం కాలేదు. వారి నిర్లక్ష్య తీరుకు నిదర్శనంగా కనిపిస్తున్నది. సర్వేలు చేసి నివేదిక రూపొందించడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి.
ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ప్రభుత్వాలు తక్షణ సహాయం ప్రకటించడం అనవాయితీగా వస్తున్న ది. వరంగల్ నగరాన్ని వరద ముంచెత్తింది. వందల కాలనీలు, వేల కుటుంబాలు మూడు రోజుల పాటు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో ప్రభుత్వాలు తక్షణ సహాయం ప్రకటిస్తాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నగరంలోని వారి దుస్థితిని కళ్లారా చూసినా చలించలేదు. తక్షణ సహాయం ప్రకటించలేదు. నష్ట నివేదికలు పంపించండి.. హైదరాబాద్లో సమీక్ష చేస్తామని చెప్పడం విడ్డూరం. వరద బాధితులకు సర్కారు సహాయంపై ప్రజా ప్రతినిధుల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. సీఎం పర్యటన తర్వాత కాంగ్రెస్ నేతలు వరద బాధితుల అకౌంట్లో రూ. 15 వేలు నగదు జమవుతాయని, నెల రేషన్ మీ ఇంటి ముందుకు వస్తుందని చెప్పారు. ఇప్పటికీ రూ. 15 వేలు లేవు. నెల రేషన్ ఇచ్చిందీ లేదు. వారి తీరుపై బాధితులు మండి పడుతున్నారు. రోడ్డున పడ్డ కుటుంబాలు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాయి.
సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవ డంపై మండిపడుతున్నారు. అధికార పార్టీ నాయకులంతా ఉపఎన్నిక ప్రచారంలో నిమగ్నమవ్వడంపై దుమ్మెత్తి పోస్తున్నారు.స్థానిక ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిష్ట వేసి ప్రజల కష్టాలను తీర్చాల్సి ఉండగా, ముఖ్యమంత్రి వచ్చే రోజు హడావుడి చేసిన హైదరాబాద్కు వెళ్లారు. ఇప్పటికి నియోజవర్గంలో వరద ప్రాంతాల ప్రజలకు ముఖం చూపక పోవడంపై బాధితులు మండిపడుతున్నారు.