తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నగరాల రూపకల్పన, నదుల సంరక్షణ వంటి అంశాలు కొత్తవి కావు. ముఖ్యంగా హైదరాబాద్ నగర చరిత్రలో మూసీ నది ఒక ప్రత్యేక గుర్తింపును సంతరించుకున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఈ నదిని కేవలం ఒక ప్రవాహంగా కాకుండా నగర సంస్కృతికి సంబంధించిన ప్రతీకగా కూడా చూడాలని అభిలషించారు. కేసీఆర్ హయాంలో నగరాభివృద్ధి, చెరువుల పునరుద్ధరణ, నీటి వనరుల పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో పలు ప్రణాళికలు రూపొందించారు. అదే సమయంలో అభివృద్ధి అనే పదం ప్రజల జీవితాలకు దూరంగా ఉండకూడదనే భావనను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
నగరం అభివృద్ధి చెందాలి, నదులు శుభ్రంగా ఉండాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రణాళికలు అమలు చేసింది. ఆ ప్రక్రియలో సాధారణ ప్రజల జీవన భద్రత, వారి గౌరవం కూడా కాపాడాలని కేసీఆర్ చెప్పిన ఆలోచన అప్పట్లో విస్తృతంగా చర్చకు దారితీసింది. అందుకే నదుల అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు కేవలం నిర్మాణాలు, ప్రాజెక్టులు మాత్రమే కాకుండా సమాజంలోని అన్నివర్గాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నదనే భావన మరింత ప్రాధాన్యం సంతరించుకున్నది.
పట్టణాల అభివృద్ధి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది.. మెరిసే రహదారులు, సుందరమైన నదీ తీరాలు, ఆకర్షణీయమైన ఉద్యానవనాలు. కానీ ఆ అందాల వెనుక ఎన్నో కుటుంబాల ఆందోళనలు, అనిశ్చితి, జీవన పోరాటం కూడా దాగి ఉంటాయి. ఇటీవల మూసీ నది తీర అభివృద్ధి పేరుతో
జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు అదే ప్రశ్నను మళ్లీ మన ముందుకు తెచ్చాయి. నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం తప్పు కాదు. కానీ ఆ అభివృద్ధి సాధనలో బలహీన వర్గాల జీవితాలు ఎక్కడ నిలుస్తాయన్నది సమాజం ముందున్న ముఖ్యమైన ప్రశ్న.
హైదరాబాద్ నగరానికి మూసీ నది ఒక చారిత్రక గుర్తింపు. ఎన్నో శతాబ్దాలుగా నగర జీవనంతో కలిసిపోయిన ఈ నది పరిసరాలు ఇప్పుడు కొత్త రూపు దాల్చాల్సిన అవసరం ఉన్నది. ఆ లక్ష్యాలను అమలు చేసే విధానం ఇపుడు పెద్ద చర్చకు దారితీస్తున్నది. ఎందుకంటే మూసీ తీరాల్లో కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్న వేలాది కుటుంబాల జీవన పరిస్థితి ఒక్కసారిగా అనిశ్చితిలో పడిపోయింది. చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని, వివిధ రకాల పనులు చేసుకొంటూ దైనందిన జీవనం సాగించే పేద కుటుంబాలకు ఈ ప్రాంతాలే ఆశ్రయం. అక్కడే వారి జీవితం, ఉపాధి, పిల్లల చదువు అన్నీ కొనసాగుతున్నాయి. అలాంటి ప్రాంతాల్లో అకస్మాత్తుగా బుల్డోజర్ యంత్రాలతో ఇండ్లను కూల్చివేయడం వంటి చర్యలు ఎన్నో కుటుంబాలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక ప్రధాన సమస్య ఇదే. ప్రభుత్వాలు పెద్ద ప్రణాళికలు రూపొందిస్తాయి. కానీ ఆ ప్రణాళికల ప్రభావం సాధారణ ప్రజల జీవితాలపై ఎంతగా ప్రభావం చూపిస్తుందో అంతగా ఆలోచించదు. ఒక ప్రాంతాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించడం సులభం. కానీ అక్కడ నివసిస్తున్న కుటుంబాలకు గౌరవంగా పునరావాసం కల్పించడం మాత్రం అంత సులభం కాదు. మూసీ తీరం విషయానికొస్తే కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. వరదల ప్రమాదం తగ్గించాలంటే తీరాలను శుభ్రం చేయాలి. నగర పర్యావరణాన్ని కాపాడాలంటే ఈ చర్యలు అవసరం. నగర అభివృద్ధి కోసం సరైన ప్రణాళికలు రూపొందించాలి. ఆ సమయంలో మరో వాస్తవాన్ని గుర్తించక తప్పదు. ఎంతోమంది ప్రజలు దశాబ్దాలుగా అక్కడే జీవిస్తున్నారు. వారికి జీవన హక్కు ఉన్నది. ప్రభుత్వం తీసుకొనే ప్రతి నిర్ణయంలోనూ ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
పేద కుటుంబాలకు ఇల్లు అంటే కేవలం గోడలు కాదు. అది వారి భద్రత, గౌరవం, జీవితానికి ఒక స్థిరత్వం. ఉదయం లేచేసరికి తమ ఇల్ల్లే లేకపోతే వారి జీవితం ఎక్కడ మొదలవుతుంది? పిల్లల చదువు ఎలా కొనసాగుతుంది? రోజువారీ పనులు ఎలా సాగుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కూడా ప్రభుత్వ బాధ్యతే. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఈ సమస్యను కండ్లకు కట్టినట్టు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇండ్లను కూల్చివేయడానికి అధికారులు భారీ యంత్రాలు తీసుకురావడం, ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం, తమ నివాసాలను కాపాడుకోవాలని కోరుకోవడం వంటి హృదయ విదారకమైన దృశ్యాలు కనిపించాయి. ఇది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు. అభివృద్ధి ముసుగులో పేదల పొట్టగొట్టే పనులు దేశంలోని అనేక నగరాల్లో జరుగుతున్నాయి. ఇది పెద్ద సామాజిక ప్రశ్న.
అభివృద్ధి అనేది కేవలం నిర్మాణాల మార్పు కాదు. అది మనుషుల జీవితాలను మెరుగుపరిచే ప్రక్రియ కావాలి. ఒక ప్రాంతం అందంగా మారితే సరిపోదు. అక్కడి ప్రజలు కూడా గౌరవంగా జీవించగలగాలి. పేదలను పక్కకు నెట్టి నిర్మించిన అందం ఎప్పటికీ సమాజానికి శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు. మూసీ నది అభివృద్ధి ప్రణాళికలో కూడా ఇదే సూత్రం పాటించాలి. ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం ఉంటే ముందుగా సమగ్ర సర్వే చేయాలి. అక్కడ నివసిస్తున్న కుటుంబాల వివరాలు నమోదు చేయాలి. వారికి ప్రత్యామ్నాయంగా గౌరవప్రదమైన నివాసాలు కల్పించాలి. ఉపాధి అవకాశాలు దూరం కాకుండా చూడాలి. ఈ చర్యలు లేకుండా కేవలం ఖాళీ చేయించడం మాత్రమే జరిగితే అది అభివృద్ధి కాదు..బలహీనులపై ఒత్తిడి అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ పరీవాహక ప్రాంతంలో సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపట్టింది. ఇదే విషయాన్ని ఆ పార్టీ వర్గాలు ఇటీవల పెద్దఎత్తున చర్చకు తీసుకొచ్చాయి. ‘బ్యూటిఫికేషన్ వితౌట్ డిమోలిషన్’ పేరుతో ప్రచారం నిర్వహించాయి. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి క్షేత్రస్థాయిలో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని పెంచేలా ఉండాలి. ఒకవైపు నగర సౌందర్యం, మరోవైపు పేదల జీవన భద్రత.. ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడమే నిజమైన పాలన. నదీ తీరాలు శుభ్రంగా ఉండాలి, నగరం అందంగా ఉండాలి. కానీ అదే సమయంలో ఆ నగరాన్ని నిర్మించిన కార్మికులు, సాధారణ కుటుంబాలు జీవించే హక్కు కలిగి ఉండాలి.
నిజమైన అభివృద్ధి అంటే బలహీనుల కన్నీళ్లు తుడిచే మార్పు. ఒక కుటుంబం గుడిసె కూల్చిన తర్వాత వారి భవిష్యత్తు ఎక్కడ అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితేనే ఆ ప్రణాళికకు న్యాయం జరుగుతుంది. మూసీ నది తీరాల విషయంలో కూడా ప్రభుత్వానికి ఈ ఆలోచన అవసరం. నగరం సుందరంగా మారాలని ప్రజలంతా కోరుకొంటారు. కానీ అందులో ఎవరి బాధా దాగి ఉండకూడదు. నగరమంటే నిర్మాణాలే కాదు.. ప్రజల గౌరవప్రద జీవనం. మూసీ తీరంలోనూ సర్కార్ ఇదే గుర్తుంచుకోవాలి.
– చిటికెన కిరణ్ కుమార్
94908 41284