సంగారెడ్డి, మార్చి 6(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేతల భూదాహం తీరడం లేదు. అధికార బలంతో పేదల భూముల అప్పనంగా సొంతం చేసుకుంటున్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత ఆర్ఆర్ఆర్ సమీపంలోని అసైన్డ్ భూములపై కన్నుపడింది. కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులోని జాతీయ రహదారి పక్కగా ఉండడంతో పాటు త్వరలో నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) పక్కనే సర్వేనెంబర్ 481లోని అసైన్డ్ భూములను సొంతం చేసుకునేందుకు ఓ కాంగ్రెస్ నేత పావులు కదుపుతున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాంతంలో పట్టా భూముల విలువ ఎకరానికి రూ.6 నుంచి రూ.8 కోట్ల వరకు పలుకుతున్నది. ఆర్ఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే ఈ భూముల విలువ అమాంతం రెట్టింపు కానున్నది. దీంతో ఆర్ఆర్ఆర్ సమీపంలో 481 సర్వే నెంబర్లోని కోట్ల రూపాయలు విలువ చేసే అసైన్డ్ భూములను అధికార బలంతో సొంతం చేసుకునే పనిలో కాంగ్రెస్ నేత నిమగ్నమయ్యాడు. మల్కాపూర్ శివారులోని సర్వే నెంబరు 481లో 10 ఎకరాలు 61వ నెంబరు జాతీయ రహదారి పక్కనే ఉం టుంది. ఈ పది ఎకరాల భూమి విలువ భవిష్యత్తులో రూ.కోట్ల విలువ చేయనుండడంతో, ఈ భూములను మొదట దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేత ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులో 481 సర్వేనెంబర్లో సుమారు 250 ఎకరాల ఖారిజ్ ఖాతా భూములు ఉన్నాయి. మల్కాపూర్ శివారులో జాతీయ రహదారి 61 నుంచి ప్రారంభమై గిర్మాపూర్ శివారు వరకు 250 ఎకరాల ఖారిజ్ ఖాతా భూములు విస్తరించి ఉన్నాయి. ఈ భూములను 1955-1960 ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం మల్కాపూర్‌లోని భూము లు లేని దళితులు, బీసీలకు అసైన్డ్ చేసింది. సుమారు 180 మంది పేదలకు ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు భూమిని అసైన్డ్ చేశారు.
481 సర్వే నెంబర్లో అసైన్మెంట్ చేసిన భూములు మూడు నుంచి నాలుగు తరాలుగా వారసత్వంగా చేతులు మారుతూ వస్తున్నాయి. నాలుగో తరం వారసులు భూములు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. 481 సర్వే నెంబర్ సమీపంలోనే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కానున్నది. దీంతో అధికార పార్టీ కాంగ్రెస్ నేతల దృష్టి ఈ భూములపై పడింది. ఎలాగైనా ఈ భూముల్లో ఉన్న అసైనీల నుంచి భూములు అగ్గువకు కొనుగోలు చేసి, ఆ తర్వాత ఆ భూములకు ఎన్వోసీ సాధించుకుని భూములు సొంతం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు పావులు కదుపుతున్నట్లు తెలిసింది.
481 సర్వే నెంబర్లో సుమారు 250 ఎకరాల అసైన్డ్ భూ ములు ఉండగా, ఇందులో పది ఎకరాల భూమి మల్కాపూర్ శివారులో తుంగమడుగు వాగు పక్కన జాతీయ రహదారిని ఆనుకుని ఉంటుంది. ఈ భూమి అటు జాతీయ రహదారి పక్కనే ఉండడంతో పాటు త్వరలో నిర్మించబోయే ఆర్ఆర్ఆర్కు దగ్గర అవుతుంది. సర్వే నెంబర్ 481/2/6 తోపాటు మరికొన్ని సర్వే నెంబర్లలో పది ఎకరాల భూమి పది మంది అసైనీల చేతిలో ఉంది. ఈ పది ఎకరాల భూమి విలువ బహిరంగ మార్కెట్లో కోట్ల రూపాయలు పలుకుతున్నది.
ఎలాగైనా ఈ పది ఎకరాలు సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ నేత టార్గెట్‌గా పెట్టుకుని, ఆరునెలల క్రితం నుంచి పావులు కదపడం ప్రారంభించారు. పది మంది అసైన్డ్ భూములు ఉన్న రైతులను కాంగ్రెస్ నేత అనుచరులు ఇద్దరు సంప్రదించి మీ భూములు ఎన్నిరోజులైనా పట్టాలు కావు, అలాగే అమ్ముకోవడానికి అవకాశం ఉండదు, కాబట్టి మీ భూములు మాకు ఇస్తే మార్కెట్ ధర చెల్లించి తీసుకుంటామని ఒప్పించినట్లు తెలిసింది. ఎకరాకు కోటి రూపాయల నుంచి రూ.1.50 కోట్లు చెల్లించేలా అసైనీ రైతులతో ఒప్పందం కుదర్చుకున్నట్లు సమాచారం.
పది మందిలో ఏడుగురు రైతులకు డబ్బులు చెల్లించగా, మరో ముగ్గురికి కాంగ్రెస్ నేత డబ్బులు చెల్లించాల్సి ఉన్నట్లు తెలిసింది. రైతులందరికీ త్వరలో డబ్బులు పూర్తిగా చెల్లించి, ఆ భూములకు ఎన్వోసీ సాధించేందుకు కాంగ్రెస్ నేత ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. పది ఎకరాల భూమి పది మంది భూమిలేని పేదలకు 1955-1958కి ముందే అసైన్మెంట్ చేసిన నేపథ్యంలో ఈ భూములు సెసాల పహాణీలోని రక్షిత కౌలుదారులుగా చూపించి ఎన్వోసీ తీసుకునేందుకు కాంగ్రెస్ నేత ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
అధికార బలంతో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి పది మంది రైతులకు ఎన్వోసీ ఇప్పించి, ఆ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చేలా కాంగ్రెస్ నేత తెరవెనక చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. పది మంది అసైనీలకు ఎన్వోసీ వచ్చిన వెంటనే వారి పేరిట పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకుని, ఆ తర్వాత పది ఎకరాల భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కాంగ్రెస్ నేత సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కోట్లాది రూపాయల విలువ చేసే అసైన్డ్ భూములు కాంగ్రెస్ నేత అధికార బలం ఉపయోగించి అతి చౌవకగా అడ్డదారిలో సొంతం చేసుకునే కుట్ర చేస్తున్నారు.