హనుమకొండ సబర్బన్/తొర్రూరు, ఫిబ్రవరి 20: సాగునీటి సరఫరా విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉరేస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డితో కలిసి ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల శివారులోని దేవాదుల పంపుహౌస్‌ను పరిశీలించారు. మోటర్లు ఎందుకు నడుస్తలేవని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్ట్ ప్రారంభమైన నాడు పంపింగ్ కోసం కనీసం వంద రోజులు కూడా నీరు అందుబాటులో ఉండేది కాదని, ఇలాంటి ప్రాజెక్ట్‌కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మక్క బరాజ్‌ను కట్టి 365 రోజులు నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. యేటా 60టీఎంసీల నీటిని తోడుకునే అవకాశం ఉన్నా సరైన నిర్వహణ లేని కారణంగా సగం కూడా పంపింగ్ చేయలేకపోతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలోనే దేవాదుల మొదటి దశ, రెండో దశ, మూడో దశ పనులు పూర్తయ్యాయని, ప్రస్తుత కాంగ్రెస్‌ప్రభుత్వ అసమర్ధత వల్ల రైతులు వినియోగించుకోలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. గతేడాది దేవన్నపేట పంపుహౌస్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి హడావుడిగా గాలిమోటర్ వేసుకుని వచ్చి మంత్రులు చేసిన ప్రారంభోత్సవం హస్యాస్పదంగా మారిందన్నారు. కేవలం 3వేల ఎకరాల భూసేకరణతో పిల్ల కాల్వల పనులు పూర్తి చేయాల్సి ఉండగా, అది కూడా చేయలేని అసమర్ధ ప్రభుత్వంగా కాంగ్రెస్‌ను విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లుతెరిచి అన్ని పంపులను నడిపించి పంటలు ఎండిపొకుండా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తొర్రూరులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని దేశవ్యాప్తంగా పర్యటిస్తుంటే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ నాయకులే రాజ్యాంగాన్ని తుంగలో తొకుతున్నారని అన్నారు. తొర్రూరు మున్సిపల్ జరిగిన ఎన్నికల్లో ప్రజల తీర్పు బీఆర్ఎస్కు అనుకూలంగా వచ్చిందని, తొమ్మిది వార్డుల్లో కౌన్సిలర్లు గెలవడం ఇందుకు నిదర్శనమని పేరొన్నారు. అయితే, అధికార బలంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసిందని విమర్శించారు. ఎంపీ కడియం కావ్యకు వరంగల్‌లో ఓటు ఉండగా, మళ్లీ తొర్రూరులో ఓటు వినియోగానికి అనుమతించడం చట్ట విరుద్ధమన్నారు.
ఆలంపూర్ నియోజకవర్గంలో ఓటు మార్పుకు అనుమతి ఇవ్వని అధికారులు, ఇకడ మాత్రం అనుమతించడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శించారు. దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సుమారు 1400 మంది పోలీసులను మోహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, బీఆర్ఎస్ కార్యకర్తలను అణచివేయడానికి పోలీసులను వాడుకున్నారని మండిపడ్డారు. ఓటర్ల మద్దతు లేనందున కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకొని గెలిచిందన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణపై మాట్లాడుతున్నప్పటికీ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటే ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పారదర్శకత లేదని, రైతు సమస్యలపై ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్కు ప్రజల్లో విశేష మద్దతు ఉందని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ధర్మసాగర్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మర్రి యాదవరెడ్డి, గంట రవికుమార్, గుండ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మండల నాయకులు కర్ర సోమిరెడ్డి, బండ రత్నాకర్‌రెడ్డి, భగవాన్‌రెడ్డి, విక్టర్ బాబు, బొడ్డు ప్రతాప్, లాల్ మహ్మద్, లక్క శ్రీనివాస్, బెల్లం ప్రేమ్‌కుమార్, తొర్రూరులో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాసర్, శంకర్‌నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మర్రి యాదవ్రెడ్డి, మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, పట్టణ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.