హనుమకొండ సబర్బన్(కమలాపూర్), నవంబర్4: గత15 రోజుల నుంచి ఒక్క గింజా కొనలేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలే తప్ప వడ్లు కొనుడు వద్దా అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం కమలాపూర్ మార్కెట్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. వడ్ల కొనుగోలు, మద్దతు ధర, బోనస్ ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో రైతుల పంటలు మిల్లులకు చేరకముందే సంచులు పంపించి, ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు చేసి ధాన్యాన్ని సేకరించిందని గుర్తు చేశారు. కల్లాల్లోని ధాన్యాన్ని కోతులు, పందికొక్కులు నాశనం చేస్తున్నాయని, రైతులు రాత్రింబవళ్లు కాపలా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఒక్క రోజు కూడా వడ్ల కొనుగోలుపై రివ్యూ పెట్టారా అని ప్రశ్నించారు. అలాగే పత్తికి మద్దతు ధర కూడా అందడం లేదని, రూ. 7521కు కొనుగోలు చేయాల్సిన పత్తిని రైతులు కేవలం రూ. 5వేలకే అమ్ముకునే దుస్థితి ఏర్పడిందన్నారు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతులకు రైతుబంధు అం దించారని, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు ఆపినప్పటికీ రైతుబంధు ఆపలేదని గుర్తు చేశారు.
పదేళ్ల కాలంలో 11సార్లు రైతులకు రూ. 72,815 కోట్లను రైతుబంధు ద్వారా రైతులకు అందించి ఘనత కేసీఆర్‌ది అన్నారు. రైతులకు గన్నీ సంచులు, టార్పాలిన్ల వంటి చిన్న సహాయం కూడా చేసే తెలివి రేవంత్‌రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. వెంటనే వడ్లను కొనుగోలు చేసి రూ. 500 బోనస్ ఇవ్వాలని, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ కళ్యాణిలక్ష్మణ్, నవీన్, సింగిల్‌విండో వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, నాయకులు తిరుపతిరెడ్డి, అశోక్, మెండు రమేశ్, మాట్ల వెంకటేశ్వర్లు, రవీందర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.