పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యనందించే లక్ష్యంతో గత కేసీఆర్ సర్కారు గురుకులాల వ్యవస్థకు శ్రీకారం చుడితే ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం మాత్రం నిర్వీర్యం చేయాలని చూస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ విద్యాశాఖను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడమే గాక ఎనిమిది నెలలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల అద్దె బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పెడచెవిన పెట్టడంతో విసిగిపోయిన భవనాల యజమానులు మంగళవారం ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల గేట్లకు తాళాలు వేసి నిరసన తెలిపారు. దీంతో దసరా సెలవుల తర్వాత పాఠశాలలకు చేరుకున్న అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులను బడి బయటే ఉండాల్సి వచ్చింది. అయితే యజమానుల ఆందోళనతో దిగొచ్చిన సర్కారు కొన్ని నెలల బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో పాఠశాలలు తెరుచుకు న్నాయి. మిగతావి కూడా వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
తొర్రూరు/గూడూరు/భూపాలపల్లి రూరల్/ములుగు రూరల్/రేగొండ/నర్సంపేట రూరల్/ ఖానాపురం/ చెన్నారావుపేట/దుగ్గొండి/కరీమాబాద్ : రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల భవనాల అద్దె చెల్లింపులను ప్రభుత్వం కొద్ది నెలలుగా నిలిపివేయడంతో వాటి యజమానులు మంగళవారం పాఠశాలల గేట్లకు తాళాలు వేశారు. సిబ్బంది, విద్యార్థులను లోపలికి అనుమతించకపోవడంతో వారు బయటే పడిగాపులు కాయాల్సి వచ్చింది. పలుమార్లు అధికార యంత్రాంగానికి, మంత్రులను కలిసి విన్నవించినా వారు పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రతి నెల ఈఎంఐ చెల్లించడం కోసం అప్పు చేయాల్సి వస్తున్నదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సిబిల్ స్కోర్ దెబ్బతిని రుణాలు తీసుకోలేని పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఓ వైపు యజమానుల ఆందోళనలు, మరోవైపు తాళాలు తీయకుండా క్రిమినల్ కేసులు పెడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించడంతో పరిస్థితి చేయిదాటుతుందని ప్రభుత్వం భావించింది. చివరికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలుగచేసుకుని సాయంత్రం వరకు కొన్ని నెలల బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి గేట్లు తెరుచుకున్నాయి. బీసీ గురుకులాలకు మూడు నెలలు, మైనార్టీ గురుకులాలకు నాలుగు నెలల అద్దె బకాయిలను యజమానుల అకౌంట్లలోకి నేరుగా పంపిడంతో భవనాల యజమానులు కొంత ఊరట చెందారు.
గురుకులాలకు గేట్లు వేయడంతో అధ్యాపకులు, విద్యార్థులు బయటే పడిగాపులు కాయాల్సి వచ్చింది. దసరా పండుగ తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో ఉత్సాహంగా వచ్చిన పిల్లలు తాళం వేసి ఉండడం చూసి నివ్వెరపోయారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల గురుకులాల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. వరంగల్లోని ఉర్సు గుట్ట వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాల భవనం, నర్సంపేట ద్వారకాపేటలోని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలుర కళాశాల వసతి గృహానికి, సర్వాపురం శివారులోని గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాల, చెన్నారావుపేట బాలికల సాంఘిక సంక్షేమ, ఖానాపురం మండలం ఐనపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల, దుగ్గొండి మండలం గిర్నిబావిలోని ఎంజేపీ గురుకుల పాఠశాలలకు యజమానులు తాళం వేశారు. అలాగే మహబూబాబాద్ జిల్లా తొర్రూరుతో పాటు నాంచారిమడూర్లోని జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల, తొర్రూరులోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల, గూడూరు ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలకు తాళం వేశారు. భూపాలపల్లి జిల్లా రేగొండలోని మహాత్మా జ్వోతిబా ఫూలే బాలుర, గాంధీనగర్లోని మహాత్మా జ్వోతిబా ఫూలే బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాల, ములుగు మండలం మల్లంపల్లిలో కొనసాగుతున్న ఏటూరునాగారం టీఎస్డబ్ల్యూఆర్ఎస్ బాలుర జూనియర్ కాలేజీకి యజమానులు తాళం వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కేవలం ఒక నెలకు సంబంధించిన అద్దెను మాత్రమే యజమానులకు చెల్లించగా సుమారు ఎనిమిది నెలల బకాయిల చెల్లింపు పెండింగ్లో పెట్టడంతో భవన యజమానులు గేట్లకు తాళాలు వేసి మంగళవారం నిరసన తెలిపారు.
ఏటూరునాగారం సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ములుగు మండలంలోని మల్లంపల్లిలోని అద్దె భవనంలో కొనసాగుతోంది. అద్దె బకాయిల కోసం యజమానుల గేట్లకు తాళం వేయడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు, వారిని తీసుకొచ్చిన తల్లిదండ్రులు గురుకుల ఆవరణలో ఉన్న మామిడి చెట్ల కింద పడిగాపులు కాశారు. ఈ గురుకులంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ కలిపి 600మంది చదువుతుండగా సెలవుల ముగియడంతో మంగళవారం వచ్చారు. మధ్యాహ్న భోజనం లేక ఆకలికి అలమటించారు. సాయంత్రం వరకు తాళం తీయకపోవడంతో గురుకుల సిబ్బంది తల్లిదండ్రులకు నచ్చజెప్పి తాము సమాచారం అందించినప్పుడు విద్యార్థులను తీసుకొని రావాలని చెప్పి ఇంటికి పంపించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు తల్లిదండ్రులు గురుకుల సిబ్బందితో గొడవ పడి పిల్లలను తీసుకొని వెళ్లారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ అంకయ్యను వివరణ కోరగా కిరాయి చెల్లించకపోవడంతో భవన యజమాని వద్ద పనిచేసే వ్యక్తి వచ్చి తాళం వేశాడని, యజమానితో మాట్లాడినప్పటికి వినలేదని తెలిపారు. తాను ఉపాధ్యాయులతో కలిసి ఆర్సీవో కార్యాలయానికి వెళ్తున్నట్లు తెలిపారు. అలాగే రేగొండలోనూ మధ్యాహ్నం వరకు గేట్లకు తాళం తీయకపోవడంతో విద్యార్థులు పస్తులుండాల్సి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. విద్యార్థులకు ఇబ్బంది కావద్దని ఎనిమిది నెలలుగా ఎదురుచూశాం. గురుకుల పాఠశాల భవనానికి నెలకు రూ.3 లక్షలు, కళాశాల భవనానికి నెలకు రూ.4,50,601 చొప్పున యజమానులకు ఎనిమిది నెలల బకాయిలు రావాల్సి ఉంది. బ్యాంకుల్లో తెచ్చుకున్న లోన్లకు కిస్తీలు సకాలంలో చెల్లించేందుకు అప్పులు చేస్తున్నారు. మా బాధను అర్థం చేసుకొని బకాయిలు చెల్లించాలని ఉన్నతాధికారులకు విన్నవించాం. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చేసేది లేక భవన యజమానులందరం కలిసి గేట్లకు తాళాలు వేసి నిరసన తెలపాల్సి వచ్చింది. ప్రభుత్వం కొన్ని నెలల బకాయిలు విడుదల చేసినందుకు ధన్యవాదాలు. మిగితావి కూడా త్వరలో చెల్లిస్తారన్న ఆశాభావంతో ఉన్నాం.