కాశీబుగ్గ, మే 4 : రైతులు పండించిన మక్కల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కావాలనే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే మక్కలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు ఉత్సవాలు నిర్వహించాలని సవాల్ విసిరారు. సోమవారం ఆయన బీఆర్ఎస్ బృందంతో కలిసి వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. మక్క రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, క్రయ విక్రయాల తీరును పరిశీలించి వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను రెండున్నరేైండ్లెనా అమలు చేయలేదన్నారు. మార్కెట్లలో రైతు మేళాలు నిర్వహిస్తే కాంగ్రెస్ నేతలకు రైతులే తగిన బుద్ధి చెబుతారన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించామని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా పంటలను కొనుగోలు చేశామని, సకాలంలో పథకాలు, రాయితీలు అందించామన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేసినట్లు రైతులు చెంపలు వేసుకుంటున్నారన్నారు. గన్నీ బ్యాగులు ఇవ్వకుండా, కాంటాలైన బస్తాలను తరలించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మక్కల కొనుగోలు సందర్భంగా అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు బహిరంగంగా చెబుతున్నారని, వాటిని వెంటనే వాపసు చేయాలని, లేకపోతే వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. రాహుల్‌గాంధీ వరంగల్‌లో రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి ఈ నెల 6వ తేదీ నాటికి నాలుగేళ్లు పూర్తవుతుందని, అయినా ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు కాలేదన్నారు. రైతు భరోసాను ఎగ్గొట్టారని, రుణమాఫీ చేయలేదని గుర్తుచేశారు.
రాష్ట్రంలో ఎక్కడా మక్కలు కొనడంలేదని దీంతో రైతులు మండుటెండలో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు నెలల ముందే పంట కొనుగోళ్లపై సమీక్షలు చేసే వాళ్లమన్నారు. ప్రస్తుతం యూరియా, నీళ్ల కోసం, పంటల అమ్మకానికి గోసపడుతున్నారన్నారు. గతంలో పంట నష్టపోతే రూ.10వేల పరిహారం ఇచ్చినట్లు గుర్తు చేశారు. ప్రతి ఎమ్మెల్యే, మంత్రి రైతుల సమస్యలు వినాలని, ఈ నెల 6లోపు పంటలు కొనకపోతే రైతులు క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తారని హెచ్చరించారు. తాము పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 6న హనుమకొండలో నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరి వాసుదేవరెడ్డి, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, కార్పొరేటర్లు మరుపల్లి రవి, దిడ్డి కుమారస్వామి, మాజీ కార్పొరేటర్లు బయ్య స్వామి, కుందారపు రాజేందర్, జోరిక రమేశ్, నాయకులు ఎల్లావుల లలితాయాదవ్, డాక్టర్ హరి రమాదేవి, నేరెళ్ల రాజు, ఈట్యాల హరికృష్ణ, కేతిరి రాజశేఖర్, ముడుసు నరసింహ, పత్రి సుభాష్, రాజ పోషాలు, పసులాది మల్లయ్య, సిలువేరు పవన్‌కుమార్, గోరంట్ల మనోహర్, జన్ను సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తున్నది. పండించిన పంటను అమ్ముకోవాలంటే ఇబ్బంది పెడుతున్నది. కావాలనే మార్క్‌ఫెడ్ మక్కలు కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు మండుటెండలో 25 రోజులుగా మార్కెట్లో అవస్థలు పడుతున్నారు. అధికారులు కావాలనే గన్నీ సంచులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఒకవేళ కాంటాలు నిర్వహించిన తర్వాత బస్తాలు కుట్టుడు, డీసీఎంలో లిఫ్టింగ్ కోసం అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నరు. కాంగ్రెస్ చెప్పిన మాటలను నమ్మి ఓటు వేసి మోసపోయినట్లు రైతులు బహిరంగంగానే అంటున్నరు. ఎకరానికి 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని జాప్యం చేస్తుండడంతో వ్యాపారులు ఇదే అదనుగా రూ.1800కే కొనుగోలు చేస్తున్నరు. బీఆర్ఎస్ మీటింగ్‌లు పెడితే వెంటనే రైతు భరోసా కొద్దికొద్దిగా విడుదల చేస్తున్నరు. కేసీఆర్ హయాంలో 11 సార్లు, 70 లక్షల మంది రైతులకు రూ.72 వేల కోట్లు రైతుల ఖాతాల్లో నాట్లకు ముందు వేశారు. కాంగ్రెస్ మాత్రం ఓట్లకు.. ఓట్లకు మధ్య వేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని పంటలకు పంట నష్టం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ చేయలేదు. మక్కలు, వడ్లు కొనుగోలు చేయడం లేదు. కరెంటు సరఫరా చేస్తలేదు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ప్రభుత్వానికి తొందర్లోనే తగిన బుద్ధి చెబుతారు. రైతు సంగ్రామ సదస్సుకు రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలి.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే, జనగామ
రైతుల గోస దేవుడికి తెలుసు
ఎండనక, వాననక ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు మార్కెట్లో పడుతున్న గోస మాత్రం ఆ దేవుడికే తెలుసు. మక్కలు అమ్ముకోవాలంటే అడుగడుగునా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నది. రైతులను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్‌కు తొందర్లోనే తగిన బుద్ధి చెప్పాలి. గతంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ సర్కారే చూసుకున్నది. ముందస్తు ప్రణాళిక ప్రకారం రైతులకు మెరుగైన సేవలందించింది.
– పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
రైతు ప్రభుత్వమని రేవంత్‌రెడ్డి మోసం చేసిండు
సీఎం రేవంత్‌రెడ్డి తమది రైతు ప్రభుత్వమని చెప్పి రైతులను నిలువునా మోసం చే సిండు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైండు. 25 రోజుల నుంచి రైతులు తమ పంటను అమ్ముకోవాలంటే ఇబ్బంది పడుతున్నరు. మక్కల కొనుగోలులో ప్రతి ఒక్కరికి చేయి తడపాల్సి వస్తుండడంతో రైతులు నష్టపోతున్నరు. రైతుల పంటల కొనుగోలుపై కాంగ్రెస్ ముందస్తు ప్రణాళిక చేయడం లేదు.
– చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
మక్క రైతులపై చిన్నచూపు
రేవంత్‌రెడ్డి మక్క రైతుల సమస్యలు పరిష్కరించకుండా వారిని చిన్నచూపు చూస్తున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ మోసాలను నమ్మి ఓటు వేసి మోసపోయినట్లు రైతులు నిర్ధారించుకొంటున్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌లో తమ చెప్పుతో తాము కొట్టుకున్నట్లు ఉందని రైతు లు అంటున్నారు. ధాన్యం, మక్కల కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేసీఆర్ హ యాంలోనే రైతులకు పెద్దపీట వేసిందని రైతు లు గుర్తించారు. ప్రస్తుత ప్రభుత్వంలో కరెంట్ లేదు, ఎరువులు, విత్తనాల కొరతతో పాటు కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితి.
– ఆరూరి రమేశ్, మాజీ ఎమ్మెల్యే
రైతులకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు
కాంగ్రెస్ సర్కార్ హామీల అమలు లో పూర్తిగా విఫలమైంది. ఎన్నికల స మయంలో వరంగల్‌లో ఆ పార్టీ ఇచ్చి న డిక్లరేషన్ మరిచిపోయింది. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా రైతులకు న్యా యం జరగడం లేదు. ‘మా మంత్రి కనబడక 20 రోజులు దాటింది. మంత్రి సీ తక్క తన రీల్స్‌పై ఉన్న శ్రద్ధను రైతులపై పెట్టడం లేదు. నిజ జీవితంలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు.
– నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే