నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 10 : ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పేరుతో కాంగ్రెస్ సర్కారు డ్రామాలు ఆడుతున్నది. పూటకో మాట మాట్లాడుతూ మభ్యపెడుతున్నది. ఇప్పటికే ఎన్నికలు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేక చతికిలపడ్డది. ఇప్పుడు రిజర్వేషన్లపై మళ్లీ మోసం చేసింది. నమ్మించి, తడిగుడ్డతో గొంతు కోసింది. ఆశలు రేపి అగాధంలో పడేసింది. రాజ్యాంగ సవరణ లేకుండా అసెంబ్లీ తీర్మానంతో కోటా రాదని.. విపక్షాలు, బీసీ సంఘాలు, మేధావులు మొత్తుకుంటున్నా వినకుండా ఎన్నికల నోటిఫికేషన్ దాకా తెచ్చి చివరకు కోర్టు ముందు చేతులెత్తేసింది. చెల్లని జీవోతో చిల్లర రాజకీయానికి పాల్పడిందని ఇప్పుడు స్పష్టమైంది. రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు వల్లే అన్యాయం జరిగింది. బీసీలను దగా చేసిన రేవంత్‌రెడ్డి సర్కారుకు పోయే కాలం వచ్చింది. రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేని హస్తం పార్టీకి కర్రు వాల్చి వాత పెట్టే సమయం దగ్గర పడింది’ అని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి.
నయీంనగర్, అక్టోబర్ 10 : బీసీ రిజర్వేషన్లపై రెడ్డి జాగృతి పిటిషన్లు అధర్మమని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ నేతృత్వంలో కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ వద్ద ధర్నా చేపట్టి, జాగృతి సంఘం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణాగౌడ్ మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి కింది నుంచి పై కోర్టుల వరకు వేదికగా చేసుకుని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని రాష్ట్ర గవర్నర్ ఆమో దించి ఉంటే హైకోర్టులో స్టే వచ్చేది కాదన్నారు. బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ, బీసీ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ బీజేపీ కేంద్ర నాయకత్వంతో ఢిల్లీలో పోరాటం చేసి బీసీ రిజర్వేషన్లను సాధించాలని, అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించొద్దని కోరారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సాయిని నరేందర్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్, బీసీ జేఏసీ హనుమకొండ కన్వీనర్ తాడిశెట్టి క్రాంతి కుమార్, గడ్డం భాసర్, పద్మశాలి సంఘం జిల్లా అధ్య క్షులు బచ్చు ఆనందం, వైద్యం రాజగోపాల్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు దాడి మల్లయ్య యాదవ్, మాదం పద్మజాదేవి, తమ్మేల శోభారాణి, తడక సుమన్ గౌడ్, పాండవుల సురేశ్, వేముల మహేందర్ గౌడ్, తెల్ల సుగుణ, కిషోర్, తంగళ్లపల్లి అరుణ, రమేశ్, బూర్గుల ప్రమోద, కామగాని మౌనికా గౌడ్, గొట్టే మహేందర్, కందికొండ వేణుగోపాల్ పాల్గొన్నారు.
మహదేవపూర్ : బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తోంది. ఎన్నికల సమయంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చాక పూటకో మాట మాట్లాడుతూ మభ్య పెడుతోంది. బీసీల రిజర్వేషన్‌పై కోర్టులో స్టే రావడం ప్రభుత్వ వైఫల్యమే కారణం. ఇది బీసీలకు చీకటి రోజు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయం. ఆచరణ సాధ్యం కాని హామీలతో సర్కారు తికమక పెడుతోంది. కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు. బీసీలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు.
– సముద్రాల తిరుపతి, బీసీ సంఘం జిల్లా నాయకుడు, మహదేవపూర్
పరకాల : బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ స ర్కారు కపట ప్రేమ చూపుతూ వంచిస్తున్నది. దామాషా ప్రకా రం రిజర్వేషన్లు కల్పించాలనే న్యాయమైన డిమాండ్‌పై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు. దీనికి న్యా యపరమైన చిక్కులు వస్తాయని ముందే తెలిసినా సీఎం రేవంత్ రెడ్డి జీవో పేరుతో మో సగించే ప్రయత్నం చేసిండు. ఈడబ్ల్యూఎస్‌తో 50 శా తం మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి బీసీలకు 42శాతం ఇవ్వడంలో అభ్యంతరం ఏముంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించాలి. లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ ల చేతిలో పరాభవం తప్పదు.
– నల్లెల్ల లింగమూర్తి, మున్నూరుకాపు సంఘం పట్టణ అధ్యక్షుడు, పరకాల.
కృష్ణకాలనీ : జనాభా ప్రతిపాదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలను అణగదొకే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నడు. ఓవైపు రాజ్యాంగం ప్రకారమని, మరోవైపు పార్టీ పరంగానే 42శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తున్నామని మాయమాటలు చెబుతున్నడు. కాంగ్రెస్, బీజేపీలోని బీసీ నాయకులు వారి పార్టీలకు రాజీనామాలు చేసి బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో కలిసి రావాలి. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోవడం సిగ్గుచేటు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులను ఊళ్లలో తిరగనియ్యం.
– అమరగొండ భిక్షపతి, కాశీంపల్లి, భూపాలపల్లి