గూడూరు, అక్టోబర్10: బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీసీ ఐక్య వేదిక నాయకుడు నూకల సురేందర్ అన్నారు. శుక్రవారం ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్హెచ్ 365పై వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ రేవంత్రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నదని అన్నారు.
గ్రామ పాలన సరిగా లేక అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్రం మళ్లీ 10 సంవత్సరాలు వెనుకబడిపోయిందని పేర్కొన్నారు. హైకోర్టుకు సరైన అధారాలు చూపించి బీసీలకు ఇస్తానన్న 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం పోరాడాలని, లేనిపక్షంలో బీసీ వ్యతిరేకిగా కాంగ్రెస్ నిలిచిపోతుందని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు ఆరె వీరన్న, మేరెడ్డి సురేందర్, కాయితోజ్ దేవేందర్చారి, నూకల ఉపేందర్, రహీం, ఏదునూరి వెంకన్న, బత్తుల లక్ష్మణ్, వల్లెపు నాగరాజు, మల్లయ్య, రాములు, భిక్షపతి, రవి, అశోక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.