‘తెలంగాణ వరప్రదాయిని.. ఇంజినీరింగ్ అద్భుతం.. రైతల పాలిట కల్పతరువు.. అది ప్రాజెక్టు మాత్రమే కాదు.. నాగరికతకు చిహ్నం..’ ఇలా కాళేశ్వరం గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. అపర భగీరథుడు కేసీఆర్ దూరదృష్టితో ఉమ్మడి వరంగల్‌లోని మేడిగడ్డ వద్ద పురుడు పోసుకొని వందల టీఎంసీలను ఎత్తిపోసి లక్షలాది ఎకరాల్లో బీడు భూములను సస్యశ్యామలం చేసిన తెలంగాణ జీవనాడి కాళేశ్వరం. సాగు, తాగునీటి అవసరాలు తీరి కరువు రూపుమాపడమే గాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖల్ని సమూలంగా మార్చేసింది. స్వరాష్ట్ర ఆకాంక్షలో ఒకటైన ‘మన నీళ్లు మనకే’ నినాదం కేసీఆర్ సంకల్పంతో సాకారమై నేటికి ఆరేళ్లు పూర్తి కాగా, కాంగ్రెస్ సర్కారు వచ్చాక కాళేశ్వరంపై పనిగట్టుకొని కుట్రలకు తెరతీయడంతో రైతన్నకు మళ్లీ కష్టకాలం వచ్చింది.
– వరంగల్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగుకు జీవనాధారం. మన నీళ్లు మనకే అనే నినాదాన్ని ఆచరణలోకి తెచ్చిన అద్భుతం. తెలంగాణలోని అత్యధిక సాగు భూములకు నీటిని అందించే లక్ష్యంతో ని ర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చే సి ఆరేండ్లు పూర్తయ్యాయి. 2019 జూన్ 21న తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రా జెక్టును ప్రజలకు అంకితం చేశారు. బీఆర్ఎస్ ప్ర భుత్వ ప్రణాళికతో తెలంగాణలోని సాగు భూము లు సస్యశ్యామలమయ్యాయి.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి ప్రపంచానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ప్రతి ఎకరాకు రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందించడంలో కాళేశ్వరం ప్రాజెక్టు కీలకంగా మారింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద లోయర్ మానేరు డ్యాం నుంచి వర్ధన్నపేట మండలం ఇల్లంద వరకు మొదటి దశలో 5,05,725 ఎకరాల ఆయకట్టు ఉన్నది.
రెండో దశ పరిధిలో ఇల్లంద తర్వాత నుంచి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వరకు 3,65,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. రెండు దశల్లోని మొత్తం 8.70 లక్షల ఆయకట్టుకు రెండు పంటలకు ఏడాదిన్నర క్రితం వరకు కాళేశ్వరం నీళ్లు చేరాయి. ఎస్సారెస్పీ రెండు దశల్లోని పంటల సాగు అవసరాలతో పాటు చెరువులు, రిజర్వాయర్లకు నీటి సరఫరా జరిగింది. వరంగల్ పాత జిల్లాలోని ఎస్సారెస్పీ రెండు దశల్లో కలిపి 4,72,287 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ ఆయకట్టుకు రెండు పంటలకు పూర్తిస్థాయిలో కాళేశ్వరం నీళ్లు అందాయి. కాంగ్రెస్ ప్ర భుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు మొదలుపెట్టింది. పంటలకు నీళ్లు రాకుండా చేస్తూ అన్నదాతలను ఆగం చేస్తున్నది.
తెలంగాణలోని దాదాపు 70 శాతం ప్రాంతానికి తాగునీరు, సాగునీరు, పరిశ్రమల నీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఏటా కనీసం 80 లక్షల ఎకరాలకు నీరందించేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి ప్రాంతాల్లోని 20 లక్షల ఎకరాలకు నీరందుతున్నది. కాళేశ్వరం నీటితోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీరు అందుతున్నది.
నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టులకు కాళేశ్వరం నీరే ఆధారమవుతున్నది. కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి, నిజమాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి, హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో మరో 20 లక్షల ఎకరాల ఆయకట్టు కాళేశ్వరం ప్రాజెక్టుతో స్థిరీకరణ అయ్యింది. 2016 మార్చి 8న దశాబ్దాల తరబడి కొనసాగిన వివాదాలకు స్వస్తి పలుకుతూ, మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం నీళ్లపై ఒప్పందాలు కుదుర్చుకున్నది.
ఈ ఒప్పందంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మొదలైంది. 2016 మే 2న కన్నెపల్లి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన భాగమైన బ్యారేజీలు, పంపుహౌస్‌లు, రిజర్వాయర్ల నిర్మాణాన్ని మూడేండ్లలోనే పూర్తి చేశారు. దేశంలోనే శరవేగంగా నిర్మాణం పూర్తయిన భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు ఘనత సాధించింది. మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో గోదావరి నీళ్లను ఆరు దశల్లో లిఫ్టు చేసి 618 మీటర్ల ఎత్తులో ఉండే కొండపోచమ్మ సాగర్ వరకు నీరు తరలింది. గోదావరి నది నీళ్లను అర కిలోమీటరుకు పైగా ఎత్తుకు లిఫ్టు చేయడంతో తెలంగాణలోని కరువు నేల సస్యశ్యామలం అయ్యింది. కాళేశ్వరం నీటితోనే ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను నింపడంతో తెలంగాణలో 199 కిలోమీటర్ల మేర గోదావరి సజీవ నదిగా మారింది.