నయీంనగర్, మే 30 : కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు రావడం లేదని, ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని హనుమకొండ జిల్లా రాంనగర్‌కు చెందిన మహమ్మద్ పాషా శుక్రవారం వరంగల్ పోలీసు హెడ్ క్వార్టర్స్ ఎదుట ఉన్న హోర్డింగ్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు, మరికొందరు నాయకులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తనకు నమ్మకం లేదని తేల్చి చెప్పాడు. పశ్చిమ నియోజకవర్గం రాంనగర్లో ఉంటున్నానని తెలిపాడు. గత ఏడాది వానకాలంలో కురిసిన వర్షాలకు తన ఇల్లు మునిగిపోయిందని, అప్పుడు కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఇల్లు ఇస్తామని చెప్పారని పేర్కొన్నాడు.
అయితే పశ్చిమ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదన్నాడు. ఇండ్లున్న వారికే ఇచ్చారని చెప్పాడు. నాలుగేళ్ల క్రితం తన తండ్రి మరణించాడని, సోదరి పెండ్లి చేయాల్సి ఉన్నదన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు ఇల్లు వస్తుందని ఆశించామని, నమ్మిం చి మోసం చేశారని వాపోయాడు. ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంతో బాధగా అనిపించి ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి ఫోన్ చేశానని, ఆయన లిఫ్ట్ చేయలేదని చెప్పాడు. ఇల్లు రాలేదనే బాధతో ఏం చేయాలో తోచక ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు మహమ్మద్ పాషా తెలిపాడు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో అర్హులకు చోటు దక్కలేదని మహమ్మద్ పాషా హోర్డింగ్ ఎక్కిన చోట గుమిగూడిన వారు చర్చించుకున్నారు.