‘బీసీలను అణగదొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఇందులో భాగంగానే కుల గణనలో వారి జనాభాను తగ్గించి చూపించింది. నమ్మశక్యం గాని గణాంకాలతో ప్రజలను గందరగోళంలో పడేసింది. 2011 జనాభా లెకల ప్రకారం రాష్ట్ర జనాభా 3.51 కోట్లు ఉంటే, 2014లో చేపట్టిన కుటుంబ సర్వేలో 3.68 కోట్లు గా తేలింది. ప్రస్తుత సర్వేలో 3.54 కోట్లకు ఎలా తగ్గిందో కాంగ్రెస్ సర్కారు, రేవంత్‌రెడ్డికే తెలియాలి. అప్పుడు 51.1 శాతం బీసీ జనాభా ఉంటే, ఇప్పుడు 46.25 శాతమే ఉందని చెబుతున్నారు. దాదాపు 20 లక్షల పైబడి బీసీలను మాయం చేశారు. రోజురోజుకూ జనాభా పెరుగుతుంటే తగ్గిందని చెప్పడాన్ని బట్టి ఆ సర్వే బోగస్ అని తెలుస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నాడు. నిష్పక్షపాతంగా మరోసారి కుల గణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలి’ అని బీసీ సంఘాలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
– నమస్తే నెట్వర్క్, ఫిబ్రవరి 9
మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వం చేపట్టిన బీసీ గణన వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. సర్వే ద్వారా వారికి ఒరిగిందేమీ లేదు. విద్యా, ఉద్యోగాల్లో దెబ్బతీసేలా జనాభాను తక్కువ చేసి చూపించిండ్రు. కాంగ్రెస్ పార్టీ సర్వే చేసి కాలం వృథా చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కేవలం గొప్పలు చెప్పడానికి సరిపోతాడు గానీ బీసీలకు ప్రయోజనమేమీ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ చేసిన కుటుంబ సర్వే అశాస్త్రీయంగా ఉంది. నమ్మశక్యం గాని గణాంకాలతో ప్రజలను గందరగోళంలో పడేసింది. సీఎం రేవంత్ రెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. వారికి రిజర్వేషన్ తగ్గించి అన్ని రంగాల్లో అన్యాయం చేయాలని కుట్ర చేస్తున్నడు.
– పైండ్ల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, మహబూబాబాద్
మొగుళ్లపల్లి: సమగ్ర కులగణన లెకలు తప్పులతడకగా ఉన్నాయి. రాష్ట్రంలో బీసీల జనాభా ను తకువ చే శారు. ఇందులో 100 శాతం కుట్ర జరిగిం ది. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలన్ని చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. భారత దేశ జనాభా చైనాను మించిపోతే, అందులో బీసీల జనాభా పెరగలేదా?. బీహార్ రాష్ట్రంలో జరిగిన కులగణనలో 26 ప్రశ్నలు సంధిస్తే.. రాష్ట్రంలో బీసీలను గంద రగోళానికి గురిచేయడానికి 70 ప్రశ్నలు పెట్టారు.
– వేముల మహేందర్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, భూపాలపల్లి
కేసముద్రం: బీసీ కులాలను రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కేందుకే వారి జనాభాను తగ్గించి చూపిస్తున్నారు. గతంలో రాష్ట్రంలో 51 శాతం జనాభా ఉన్నట్లు చూపిస్తే రేవంత్ రెడ్డి చేపట్టిన సర్వేలో 46 శాతమే ఉండడం విడ్డూరం. రోజురోజుకూ జనాభా పెరుగుతుంటే ఇప్పుడు తగ్గడాన్ని బట్టి కాంగ్రెస్ సర్వే బోగస్ అని అర్థమవుతున్నది. జనాభా ఎలా తగ్గిందో ప్రజలకు వివరించాలి. బీసీలను భవిష్యత్‌లో అన్ని రంగాల్లో ఎదగకుండా కుట్రలు చేస్తున్నరు. వారి మనోభావాలను కించపరిచేలా ప్రభుత్వం కుల గణన సర్వే ఫలితాలు ప్రకటించడం హేయమైన చర్య. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. నిష్పక్షపాతంగా మరోసారి కుల గణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలి.
– నీలం దుర్గేశ్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు
హనుమకొండ: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వే ఆమోదయోగ్యంగా లేదు. 2011 జనాభా లెకల ప్రకారం రాష్ట్ర జనాభా 3.51 కోట్లుగా ఉంటే, 2014లో సమగ్ర కుటుంబ సర్వేలో 3.68 కోట్లుగా ఉంది. ప్రస్తుత సర్వే ప్రకారం 3.54 కోట్లకు ఎలా తగ్గిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 51.1 శాతం బీసీ జనాభా ఉంటే, ప్రస్తుత సర్వేలో 46.25 శాతమే ఉంది. దాదాపు 20 లక్షల పైబడి బీసీలు మాయమైనట్లు కనబడుతున్నది. రాష్ట్రంలో 1.17 కోట్ల కుటుంబాలు ఉంటే సర్వేలో 1.12 కోట్లు మాత్రమే లెకలోకి తీసుకున్నారు. ప్రస్తుత సర్వే తప్పుల తడకగా ఉంది.
గతంలో కేసీఆర్ చేసిన సర్వేనే కరెక్ట్. ఆ సర్వే 100% అని చెప్పి బీసీ సంఘాలు, మేధావులు, కాంగ్రెస్ ప్రభుత్వంలోని బీసీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా చెబుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 42 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పి అసెంబ్లీలో చర్చించి కేంద్రానికి వదిలేసి చేతులు దులుపుకున్నాడు. ఎన్నికల ప్రచారంలో బీసీలకు ఇచ్చిన హామీలను సంవత్సరం దాటినా అమలు చేయకుండా, అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నాడు. చేసిన సర్వే చెత్తబుట్టలో వేయడానికే తప్ప దేనికి పనికిరాదు.
– గొల్లపెల్లి వీరస్వామి, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు(కేయూ)
రాష్ట్రంలో బీసీ కుల గణన సంపూర్ణంగా, నిజాయితీగా నిర్వహించడంలో రేవంత్ రెడ్డి సర్కారు విఫలమైంది. నామమాత్రంగా సర్వే చేసి చేతులు దులుపుకుంది. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో దాదాపుగా బీసీలు 56% శాతం ఉన్నారని తేలింది. కాంగ్రెస్ సర్కారు పదేళ్ల తర్వాత చేపట్టిన కుల గణన సర్వేలో బీసీల జనాభా తగ్గినట్లు చిత్రీకరించారు. బీసీలను అణగదొక్కాలని వారి జనాభాను తగ్గించినట్లు సర్వేలో చూపించారు. ప్రభుత్వం మళ్లీ పారదర్శకంగా కులగణన సర్వే చేయించి, అప్పుడే అందరికీ రిజర్వేషన్ ప్రకటించాలి.
– నార్లగిరి రమేశ్, రజక సంఘం రాష్ట్ర నాయకుడు, కాజీపేట