కృష్ణకాలనీ, డిసెంబర్ 30: అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్ల పొట్టకొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వారికిచ్చిన హామీని సైతం ఎగ్గొట్టింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటోలకు గిరాకీ లేక.. ప్రభుత్వం పట్టించుకోక ఆటో డ్రైవ ర్ల జీవనం అగమ్యగోచరంగా మారింది. ఆటోలు నడవక అనేక మంది కుటుంబాలు గడవడం కష్టమవుతున్నది. ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థల నుంచీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహాలక్ష్మి పథకంతో తాము రోడ్డున పడ్డామని ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు, రాస్తారోకోలు చేపట్టారు. వీరికి బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలిచింది.
దీంతో రాష్ట్ర ప్రభు త్వం దిగొచ్చి ఏటా రూ.12 వేల జీవన భృతి ఇస్తామని ప్రకటించింది. ఈ విషయమై అసెంబ్లీ సాక్షిగా మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చి ఏడాదైనా అమలుకు నోచుకోవడం లేదు. రవాణాశాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో ప్రకటించినా ఆచరణలోకి రాలేదు. సరారు సాయం తమ కుటుంబ పోషణ కు ఎలా సరిపోతుందని ఆటో డ్రైవర్లు అప్పట్లోనే ప్రభుత్వంపై మండిపడ్డారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ జీవనభృతి విషయాన్ని ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యమాన్ని నీరుగార్చేందుకే మాయమాటలు చెప్పినట్లు ఆరోపిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సుమారు 1,500కు పైగా ఆటోలున్నాయి. ముఖ్యంగా గ్రామీ ణ ప్రాంతాల నుంచి పట్టణాలకు నిత్యం వందలాది ఆటోలు నడుస్తుంటాయి. తద్వారా అనేక కుటుంబాలకు ఉపాధి లభిస్తున్నది. గతంలో ఖర్చులన్నీ పోగా రోజుకు రూ. 600 వరకు చేతికి వచ్చేవి. కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండేది కాదు. పిల్లల చదువులు కూడ సక్రమంగా సాగేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉచిత బస్సు ప్రయాణం తెచ్చాక ఆటోలకు మహిళల ఆదరణ తగ్గింది. గతంలో వచ్చిన డబ్బులో స గం గిరాకీ కూడా ఉండడం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజుకు రూ. 200 కూడా మిగలడం లేదని, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితి ఉందని, ఫైనాన్స్ సంస్థల వేధింపులు తట్టుకోలేక కొంతమంది అప్పులు చేస్తున్నారని, మరికొందరు కిస్తీలు కట్టలేక వారికే ఆటోలు ఇస్తున్నారని అంటున్నారు. రాష్ట్రంలో అనేక మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. రాష్ట్ర సర్కారు వెంటనే స్పందించి జీవనభృతి అందించాలని ఆటో కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక ఆటోడ్రైవర్ల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. పైనాన్స్ మీద ఆటోలు తీసుకున్న వాళ్లం కిస్తీలు కట్టలేక వాళ్లకే వదిలేస్తున్నాం. గతంలో రోజుకు 8 నుంచి 10 ట్రిప్పులు నడిపేవాళ్లం. ఇప్పుడు రెండు ట్రిప్పులు కూడా పడడం లేదు. గతంలో మాట్లాడిన ఇద్దరు మంత్రులు ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మాకు జీవనభృతి అందించాలి.
– ఈరవేణి రాధాకృష్ణ, ఆటో డ్రైవర్, భూపాలపల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. రూ.12 వేల జీవన భృతి ఇస్తామని ఏడాదిగా రాష్ట్ర సర్కారు కా లం గడుపుతున్నది. ఈఎంఐలు కట్టలేక, కుటుం బం గడవక ఆర్థిక ఇబ్బందులతో చనిపోయిన ఆటో డ్రైవర్లున్నారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని పూర్తిగా మరిచిపోయినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం జీవన భృతి అందించకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతాం.
-పోలవేణి అశోక్‌కుమార్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు, భూపాలపల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళకు ఉచిత బస్సు ప్ర యాణం కల్పించడంతో ఆటోలకు గిరాకీ ఉండడం లేదు. పొద్దంతా ఆటో తోలినా ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదు. కుటుంబాన్ని పోషించుకోవడం భారమైతాంది. పిల్లలను చదవించలేకపోతున్నాం. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా రూ.12 వేల భృతి ఇవ్వడంలేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. మంత్రి పొనం గత అ సెంబ్లీ సమావేశాల్లో జీవన భృతిపై మాట్లాడతాడని ఆశపడ్డాం. కానీ ఆటో డ్రైవర్ల ఊసే ఎత్తలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం జీవన భృతి ఇవ్వాలి.
– చల్లూరి కాళీ ప్రసాద్, ఆటో డ్రైవర్, గడ్డిగానిపల్లి, భూపాలపల్లి