మహబూబాబాద్ రూరల్, నవంబర్ 14 : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ కోసం వచ్చిన తల్లిదండ్రులు హెచ్ఎం గది ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని తండ్రి ఒద్ది వీరన్న మాట్లాడుతూ.. పట్టణంలోని కంకరబోడ్ ప్రభుత్వ పాఠశాలలో తమ పాప 8వ తరగతి చదువుతున్నదని తెలిపాడు.
సోషల్ ఉపాధ్యాయుడు మూడు రోజుల క్రితం తమ పాపతో అసభ్యకర పదజాలంతో మాట్లాడాడని, ఇంటి వద్ద ఎవరితో చెప్పొద్దని బెదిరించినట్లు తెలిపారు. వెంటనే హెచ్ఎం కోట్యానాయక్ను నిలదీయగా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, తాను ఉపాధ్యాయుడితో మాట్లాడుతానని హామీ ఇచ్చినట్లు చెప్పాడు. ఇది జరిగి మూడు రోజులవుతున్నా హెచ్ఎం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పేరెంట్స్ మీటింగ్ కోసం వచ్చిన తల్లిదండ్రులు విషయం తెలుసుకొని, ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో హెచ్ఎంకు, తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం తెలుకున్న టౌన్ సీఐ మహేందర్రెడ్డి, ఎస్సైలు శివ, సూరయ్య పాఠశాలకు చేరుకొని తల్లిదండ్రులకు నచ్చజెప్పడంతో ఆందోళనను విరమించారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.
విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై టౌన్ పోలీసులు పోక్సో కేసును నమోదు చేశారు. టౌన్ సీఐ మహేందర్రెడ్డి కథనం ప్రకారం.. పట్టణ కేంద్రంలోని కంకరబోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కీచక బుద్దిని ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఇనుగుర్తి రవి గత పది రోజులుగా పాఠశాల విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని), ఇన్నాళ్లూ ఎవరికి చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డామన్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు రవిపై పోక్సోకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.