ఎల్కతుర్తి, అక్టోబర్ 3 : ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని కేశవాపూర్ గ్రామంలో సుమారు రూ. 5.40కోట్ల అభివృద్ధి పనులకు జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్‌తో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొదటగా గ్రామస్తులు ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ను డప్పుచప్పుళ్లతో ఘనంగా స్వాగ తం పలికారు. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేశా రు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలోనే గ్రామాలు, పట్టణాలన్ని సమగ్రాభివృద్ధి చెందాయని అన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప దార్శనీకుడని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ పల్లెలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దారన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పంచాయతీ భవనాలు, పల్లెప్రకృతి వనాలు, అంతర్గత రహదారులు, మురుగునీటి కాలువలు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు, గ్రామాలకు లింకు రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించామన్నారు.
మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేసుకుంటే నేడు భూగర్భ జలాలు ఉబికివస్తున్నాయన్నారు. దీంతో రైతులు రెండు పంటలను పండించుకుంటున్నారన్నారు. తాను నియోజకవర్గంలో ఇచ్చిన హామీలతో పాటు మరికొన్ని ఇవ్వని హామీలను కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమలు చేసినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. కాగా, నియోజకవర్గంలోనే మొదటిసారిగా కేశవాపూర్ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలతో పాటు క్రీడా మైదానాలకు క్రీడా సామగ్రిని సర్పంచ్, కార్యదర్శులకు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. క్రీడా సామగ్రిని యువత సద్వినియోగం చేసుకొని ఆయా క్రీడల్లో నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. కాగా, కేశవాపూర్ నుంచి గుంటూర్పల్లె వరకు రూ.90లక్షలతో నిర్మించే బీటీ రోడ్డు పునరుద్ధరణ, కేశవాపూర్ నుంచి రామకృష్ణాపూర్ వరకు రూ.1.20కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు, అంబాల వరకు రూ.3.40కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అలాగే, రూ. 29లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, రూ.16లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన, రూ.4.60లక్షలతో నిర్మించిన గౌడ సంఘం భవనాలను ప్రారంభించారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
కేశవాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మండల ఉపాధ్యక్షుడు కడిపికొండ దేవేందర్రెడ్డితోపాటు 50 మంది వరకు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడనయ్యే బీఆర్ఎస్లో చేరినట్లు దేవేందర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల స్వప్న, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్‌గౌడ్, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, సర్పంచ్ ఈర కృష్ణవేణి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ పోరెడ్డి రవీందర్‌రెడ్డి, రైల్వే బోర్డు మెంబర్ ఎల్తూరి స్వామి, మార్కెట్ డైరెక్టర్ తంగెడ మహేందర్, ఎంపీడీవో తూర్పాటి సునీత, వైద్యుడు సయ్యద్ ఎఖ్తేదార్ అహ్మద్, పీఆర్ ఏఈ ప్రణవ్, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బూర్గుల రామారావు, కడారి రాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడిశాల సమ్మయ్యగౌడ్, నాయకులు గొల్లె మహేందర్, చల్లా రవీందర్‌రెడ్డి, మేకల బాపురావు, చల్లా రాంరెడ్డి, ఈర మహేందర్, ఉమ్మారెడ్డి, అబ్బనవేన రాజయ్య, మోడం సమ్మయ్యగౌడ్, దేవేందర్‌రావు, సామల సురేశ్‌రెడ్డి, వేముల శ్రీనివాస్, చెవుల కొమురయ్య, హింగె శివాజీ, ఆరెపల్లి అర్జున్, సంపత్, శ్రీకాంత్‌యాదవ్ పాల్గొన్నారు.