Warangal | వరంగల్ చౌరస్తా: వరంగల్ సెంట్రల్ జైలు స్థలం లో నిర్మాణం చేపట్టిన వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు సందర్శించారు. హాస్పిటల్ నిర్మాణ పనులపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. భవన నిర్మాణ పనుల నిమిత్తం పెంచిన అంచనాలపై ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులను వివరణ కోరారు.
అంచనా వ్యయం పెంపు మూలంగా మెరుగుపడే అంశాలపై వారంలోగా నివేదికను అందించాలని ఆదేశించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి, సంవత్సరాంతానికి ప్రారంభోత్సవం చేపట్టడానికి వైద్య సేవలు కొనసాగించడానికి అవసరమైన అన్ని పనులు పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో డీఎంఈ నరేంద్ర కుమార్, వరంగల్ కలెక్టర్ సత్య శారద, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్అండ్బీ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.