నర్సంపేటరూరల్/నల్లబెల్లి/చెన్నారావుపేట, నవంబర్ 10: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అధికారులు, ఎన్యుమరేటర్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. నర్సంపేట మండలంలోని ఆకులతండాలో ఆదివారం ఆమె సర్వేను జిల్లా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటికీ వేసిన స్టిక్కర్లను పరిశీలించి సర్వేకు సంబంధించిన ప్రొఫార్మాను పరిశీలించారు. సర్వే లక్ష్యాలను నెరవేర్చే బాధ్యత ఎన్యుమరేటర్లపై ఉందన్నారు. ఏ ఇంటినీ వదిలిపెట్టొద్దని, అందుబాటులో లేనివారి వద్దకు మరోసారి వెళ్లి సర్వే వివరాలు సేకరించాలని సూచించారు.
తప్పులు దొర్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఎన్యుమరేటర్లకు అదనపు సిబ్బందిని కేటాయించాలని నోడల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో మండల స్పెషలాఫీసర్ టి.భాగ్యలక్ష్మి, జడ్పీ సీఈవో రాంరెడ్డి, సీపీవో గోవిందరాజన్, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీవో అంబాల శ్రీనివాసరావు, కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు. అలాగే, నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో సర్వేను కలెక్టర్ పరిశీలించారు. సర్వేపై ఎలాంటి అపోహలు వద్దని ప్రజలను కోరారు. తహసీల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీవో నర్సింహమూర్తి పాల్గొన్నారు. అంతేకాకుండా కలెక్టర్ చెన్నారావుపేట మండలంలోని కేజీబీవీని తనిఖీ చేశారు. అనంతరం ఖాదర్‌పేట, అమీనాబాద్‌లో సర్వేను పరిశీలించి సూచనలు చేశారు. ఎంపీడీవో శ్రీవాణి, ఎంపీవో శ్రీధర్‌రాజు, పాఠశాల ప్రత్యేక అధికారి జ్యోతి పాల్గొన్నారు.
వర్ధన్నపేట/పర్వతగిరి/పోచమ్మమైదాన్/సంగెం/గీసుగొండ: సర్వేలో కుటుంబాల వారీగా పూర్తి వివరాలు నమోదు చేయాలని ఇన్చార్జి అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఎన్యుమరేటర్లకు సూచించారు. వర్ధన్నపేట పట్టణంలో జరుగుతున్న సర్వేతోపాటు ఓటరు నమోదును ఆమె పరిశీలించారు. తహశీల్దార్ విజయ్‌సాగర్, ఎంపీడీవో వెంకటరమణ పాల్గొన్నారు. పర్వతగిరి మండలం దౌలత్‌నగర్‌లో సర్వేను విజయలక్ష్మి పరిశీలించి ఎన్యుమరేటర్లకు సూచనలు చేశారు. అనంతరం పర్వతగిరి ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఓటరు క్యాంపును సందర్శించారు.
తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీవో ఎం శంకర్‌నాయక్, ఆర్ఐ భారతి, కారోబార్ కరుణాకర్, జీపీ సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ 13వ డివిజన్లో సర్వే ప్రక్రియను ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి, డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి పరిశీలించారు. డివిజన్లోని వీవర్స్‌కాలనీలో సర్వేను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. కార్పొరేటర్ సురేష్కుమార్జోషితో కలిసి ఎన్యుమరేటర్ల వివరాలు తెలుసుకుని, కుటుంబ వివరాల నమోదు విధానాన్ని వివరించారు. సంగెం మండలం ఆశాలపల్లిలో సర్వేను నోడల్ అధికారులు తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీవో రవీందర్ పరిశీలించారు. గీసుగొండ మండలంలోని 21 గ్రామాల్లో సర్వే కొనసాగుతున్నది. సర్వే తీరును ఎంపీడీవో కృష్ణవేణి పర్యవేక్షించారు.