వర్ధన్నపేట, ఆగస్టు 14: వైద్యులు, అధికారులు విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్య శారద హెచ్చరించారు. మండలకేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యుల హాజరు రిజిస్టర్, ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. డాక్టర్లు ప్రతిరోజూ విధిగా దవాఖానలో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని, ఎవరైనా ఇష్టానుసారంగా విధులకు రాకుం డా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, గర్భిణులు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. రాత్రి, పగలు తేడా లేకుండా గర్భిణులు, పేదలు దవాఖానకు వస్తే సేవలందించేందుకు వైద్యులు నిత్యం ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్సాగర్, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.