రాయపర్తి : మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల (జర్నలిస్టుల గృహ సముదాయం) పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సోమవారం క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను నిర్వహిస్తున్న ఏజెన్సీ టీఎస్ ఈడబ్ల్యూఐడిసి డీఈ రామిశెట్టి రవీందర్ రెడ్డి, ఏఈ కామిశెట్టి మురళీకృష్ణ, తహసిల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, ఎంపీడీవో గుగులోతు కిషన్ నాయకులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులపై చర్చించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ గుత్తేదారుకు బిల్లులు ఎంతవరకు చెల్లించారు? బిల్లుల బకాయి ఎంత ఉంది అని అడిగి తెలుసుకున్నారు. నెలాఖరులోగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు చేపట్టాలని ఆమె అధికారులకు సూచించారు. మండలంలోని పలు గ్రామాలలో తుది దశలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయించ డంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఆమె వెంట పలువురు జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు.