సంగెం, జూలై 4 : యూరియాకు నానో యూరియా లింక్ పెట్టారు. అరలీటర్ నానో యూరియా లిక్విడ్ బాటిల్‌ను కొంటేనే ఆధార్ కార్డుతో రెండు యూరియా బస్తాలు ఇస్తున్నారు. కాపులకనపర్తి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే గవిచర్ల గోదాంలో ఎరువులు వస్తున్నాయని తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో సొసైటీ సిబ్బంది ఒక్కో ఆధార్‌కార్డుకు రెండు యూరియా బస్తాలు,అరలీటర్ నానోయూరియకు లింకు పెట్టి ఇచ్చారు.
ముందు వచ్చిన వారికి ఆ మాత్రం దొరుకగా, మిగతా వారికి యూరియా లభించక వెనుదిరిగారు. ఈ క్రమంలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద గోదాంను తనిఖీ చేసేందుకు అక్కడికి వచ్చారు. ఎరువుల నిల్వలు, స్టాకు రిజిస్టర్లు, తూకం యంత్రాలు, రసీదు పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలన్నారు. రైతులు అవసరం మేరకు యూరియ వాడాలని, అధిక నిల్వలు చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్‌కుమార్, ఏవో చట్ల యాకయ్య పాల్గొన్నారు.