నర్సంపేట, డిసెంబర్ 4 : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. సర్వాపురం శివారు ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేసి అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అయితే సీఎం వస్తుండడంతో రెండేళ్లుగా నియోజకవర్గంలోని ప్రధాన రోడ్లపై గుంతలు పడి ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని అధికారులు ఇప్పుడు వాటిపై ప్యాచ్లు వేస్తున్నారు.
సభ నిర్వహణ కోసం అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఏకంగా పదికిపైగా విద్యుత్ స్తంభాలను తొలగించి పక్కకు పడేశారు. ఇవి ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్ కళాశాలకు ప్రధాన, అత్యవసర విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసినవి కావడం విశేషం. అయితే రోడ్లు వేయడం, స్తంభాలు తొలగించడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వస్తేనే రోడ్లు బాగుచేస్తారా అంటూ మండిపడుతున్నారు.