రఘునాథపల్లి, సెప్టెంబర్ 26 : ఆరు గ్యారెంటీలు, 420 హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని, సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో రాక్షస పాలనను కొనసాగిస్తున్నాడని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని పత్తేషాపురం, ఇబ్రహీంపూర్, లక్ష్మీతండా, మాధారం, దాసన్నగూడెం, సోమయ్యకుంటతండా, ఖిలాషాపురం, మండెలగూడెం, మంగళిబండతండా, పొట్టిగుబ్బడి తండా, ఆంధ్రతండా, గిద్దెబండతండా, మేకలగట్టు, రామరాయినిబంగ్లా గ్రామాల్లో పర్యటించారు. కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహించారు.
అనంతరం నియోజకవర్గ ఇన్చార్జి వై కుమార్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించారని తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే గ్రామాల్లో తిరగకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడని, రాజీనామా చేసి ప్రజల్లోకి వస్తే నువ్వా? నేనా? తేల్చుకుందామని సవాల్ విసిరారు. సీఎం రేవంత్‌రెడ్డి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ హైదరాబాద్‌లో పేదలకు చెందిన రూ.50వేల కోట్ల విలువైన ఇండ్లను నేలమట్టం చేశాడని అన్నారు. మూసీ నది ప్రక్షాళన పేరిట వందలాది కోట్ల రూపాయలు దండుకున్నాడని అన్నారు.
మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగితే, వాటికి మరమ్మతు చేయించలేని సీఎం తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. రైతులకు సకాలంలో యూరియా అందించకపోవడంతో రాష్ట్రంలో 548మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కేసీఆర్ పాలనలో రైతులు రాజులుగా బతికారని, అందుకే మళ్లీ గ్రామాల్లో కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. నాడు ఎన్టీఆర్ కాళ్లకు చెప్పులు వేసి చంద్రబాబు పంచన చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.., అనంతరం కేసీఆర్ దగ్గర చేరి అవకాశవాదంతో వ్యవహరించి రేవంత్‌రెడ్డి వర్గంలో చేరి తన కూతురును ఎంపీగా చేసుకున్నట్లు తెలిపారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, కడియానికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను విస్మరించిందని, గ్రామాల్లో కనీసం ఏర్పాట్లు చేయకపోవడంతో మహిళలు ఇబ్బందిపడుతున్నారు. స్టేషన్‌ఘన్‌ఫూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు చేసినట్లు కడియం మాటల్లో నిజంలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన అబివృద్ధి నేటికీ గ్రామాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఇన్చార్జి ముసిపట్ల విజయ్, జిల్లా నాయకుడు గూడ కిరణ్‌కుమార్, నాయకులు మడ్లపల్లి సునీత, శాగ నాగరాజు, బొంగు అయిల్లయ్య, దుబ్బాక హరీశ్‌గౌడ్, కొయ్యడ స్వామి, బొంగు అయిలయ్య, గవ్వాని నాగేశ్వర్రావు, శ్రీనివాస్, రాములు, కుమార్, తదితరులు పాల్గొన్నారు.