లింగాల గణపురం : జనగామ జిల్లా లింగాల గణపురంలో రైతులు ఒక బస్తా యూరియా కోసం గంటల తరబడి లైన్లో వేసి చూస్తున్నారు. అధికారులు మండలంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు యూరియాను వారానికో పర్యాయం అందిస్తున్నారు. సర్వర్ డౌన్లోడ్ ఉండడంతో ఓటీపీ రావడంలో ఆలస్యం జరుగుతుంది. వారానికి ఐదు టన్నులు మాత్రమే అంటే 106 బస్తాలు అందిస్తున్నారు. లింగాల గణపురం కేంద్రంలో సోమవారం 300 మంది పేర్లు నమోదు చేసుకోగా 220 బస్తాలు మాత్రమే వచ్చాయి. మంగళవారం 220 బస్తాలు రాగా పాత రైతులు కాకుండా కొత్తగా మరో 300 మంది రావడంతో రద్దీ నెలకొంది.
దీనికి తోడు ఓటిపి రావడంలో ఆలస్యం జరుగుతుండడంతో ఒక్క బస్తా కోసం రైతులు గంటల తరబడి లైన్లో వేచి చూస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి గ్రామానికి వైన్ షాప్ ను ఏర్పాటు చేస్తా అంటూ రైతులకు మాత్రం యూరియాను అందించడంలో విఫలమయ్యాడని విమర్శించారు. ఒక్కొక్కరికి కనీసం 8 నుండి 10 బస్తాల యూరియా అవసరముండగా ఈ ఒక్కొక్క బస్తా తీసుకెళ్లి ఏ మూలకు చల్లాలి అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది రైతులు వరి, పత్తి, మిర్చి పంటలను సాగు చేశారు. ఈ సీజన్లో ఆ పంటలకు యూరియాను అందిస్తేనే ఫలితం ఉంటుందన్నారు.